రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

8 Oct, 2019 10:44 IST|Sakshi
రోదిస్తున్న ఈశ్వరరావు తల్లి పైడితల్లి, కుటుంబ సభ్యులు

సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : ఆదుకోవాల్సిన కొడుకులు అర్ధంతరంగా కన్నుమూయడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం తాము వలసపోయి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటూ... బిడ్డల మృతి వార్త విని స్వగ్రామానికి రావాల్సి వచ్చిందిరా భగవంతుడా.. అని రోదిస్తుంటూ చూపురుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. విద్యా ర్థుల మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మండలంలోని ఆరికతోట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుణుపూరు హరిశ్చంద్రప్రసాద్‌ అలియాస్‌ సంతోష్, దత్తి ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలిసిందే. టిఫిన్‌ చేయడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు రామభద్రాపురం వైపు వెళ్తుండగా మరో మిత్రుడు ఈదుబిల్లి లోకేష్‌ ఎదురయ్యాడు. దీంతో వారు వాహనం ఆపి లోకేష్‌తో మాట్లాడుతుండగా.. విజయనగరం నుంచి ఛత్తీస్‌గఢ్‌ వెళ్తున్న ట్యాంకర్‌ వీరిని ఢీ కొట్టడంతో హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. లోకేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

కుమారుడి మృతి వార్త తెలుసుకున్న హరిశ్చంద్రప్రసాద్‌ తల్లిదండ్రులు లక్ష్మణరావు, కృష్ణవేణి అదేరోజు సాయంత్రానికి గ్రామానికి చేరుకోగా... వేరే ప్రాంతంలో ఉన్న  ఈశ్వరరావు తల్లిదండ్రులు కూడా ఆదివారం రాత్రికే గ్రామానికి చేరుకుని కుమారుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత చదువులు చదివి..మమ్మల్ని పోషిస్తావనుకుంటే.. అర్ధంతరంగా వెళ్లిపోయావా.. నాయినా.. అంటూ మృతుల తల్లిదండ్రులు విలపిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. దసరా పండగ మా జీవితాల్లో చీకటి నింపిందంటూ భోరుమన్నారు.  ఇద్దరు స్నేహితుల మృతదేహాలకూ పక్కపక్కనే చితి పేర్చి సోమవారం దహనసంస్కారాలు చేపట్టారు. 

గంట తర్వాత పయనం.. 
చెన్నైలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు ఆదివారమే ఈశ్వరరావు బయలుదేరాల్సి ఉంది. శనివారం రాత్రే దుస్తులు, ఇతర సరంజామా సర్దుకున్నాడు. అయితే ఆదివారం ఉదయాన్నే అతడి బంధువొకరు రేషన్‌ సరుకులు తీసుకురావాలంటూ పురమాయించారు. ఇంతలో హరిశ్చంద్రప్రసాద్‌ వచ్చి టిఫిన్‌కు వెళ్దామని రమ్మని కోరడంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరూ రామభద్రాపురం వైపు బయలుదేరారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా... ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. గంట ఆగితే తమ బిడ్డ తమ వద్దకు వచ్చేవాడని.. కాని విధి కన్నెర్ర చేయడంతో తామే కుమారుడి మృత దేహం చూడడానికి రావాల్సి వచ్చిందని ఈశ్వరరావు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా