రైల్లో మత్తు మందు ఇచ్చి..

17 Dec, 2019 09:10 IST|Sakshi
ఆసత్పిలో చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మి, రైలు నుంచి దూకేయడంతో గాయపడిన జీవేశ్వరరావు

పూరీ–తిరుపతి రైలులో మత్తుమందు ఇచ్చి బంగారం దోపిడీ

తాము దిగాల్సిన రైల్వేస్టేషన్‌ దాటిపోవడంతో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన బాధితులు

క్షతగాత్రులను టెక్కలి ఆస్పత్రిలో చేర్పించిన బంధువులు   

టెక్కలి: బంధువు అస్తికలను పూరీలో నిమజ్జనం చేయడానికి వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబం పూరి–తిరుపతి రైలులో దోపిడీకి గురైంది. మత్తు మందు ఇచ్చి దుండగులు దోపిడీ చేయడంతో తాము దిగాల్సిన స్టేషన్‌లో దిగలేక రైలు నుంచి దూకాల్సి వచ్చింది. నిండా గాయాలతో రాత్రి పూట బంధువులకు సమాచారం అందించగా.. పట్టాల వెంబడి వెతుకుతూ వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు. బాధితులు తెలిపిన వివ రాల మేరకు..  వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ గ్రామానికి చెందిన మార్పు జోగారావు ఆయ న భార్య భాగ్యలక్ష్మి, మరో బంధువు జీవేశ్వరరావు కలిసి భాగ్యలక్ష్మి అత్త అన్నపూర్ణ అస్తికల్ని నిమజ్జనం చేసేందుకు ఆదివారం పూరీ వెళ్లారు.

అస్తికలను సోమవారం నిమజ్జనం చేసి పూరి–తిరుపతి రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. ఖుర్దా రోడ్‌లో టీ తాగిన వీరు ఆ తర్వాత మళ్లీ నౌపడ దాటాక గానీ కళ్లు తెరవలేదు. సరిగ్గా రాత్రి ఏడు గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ రైలు నౌపడ స్టేషన్‌లో ఆగుతుంది. అక్కడే వీరంతా దిగాలి. కానీ ఎవరికీ మెలకువ లేకపోవడంతో స్టేషన్‌ వెళ్లిపోయింది. తర్వాత మెలకువ వచ్చి చూస్తే స్టేషన్‌ వెళ్లిపోయింది. దీంతో హడావుడిగా రైలు చైన్‌ లాగి బండి ఆగేలోగానే అంతా కిందకు దూకే శారు. దీంతో జీవేశ్వరరావు, భాగ్యలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. జోగారావు మా త్రం స్వల్పంగా గాయపడ్డారు.

కాస్త స్పృహ ఉండడంతో బంధువులకు సమాచారం అందించారు. దీంతో బంధువులు ఆ చీకటిలో బాధితు లు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెతుకులాడుతూ ముళ్ల పొదల వద్దనున్న క్షతగాత్రులను గుర్తించారు. వెంటనే 108 కు సమాచారం అందించి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నౌపడ రైల్వేస్టేషన్‌ పరిధిలోనే వీరంతా కిందకు దూకడంతో బంధువులు గుర్తించగలిగారు. ప్రమాదం జరిగిన తర్వాత భాగ్యలక్ష్మి మెడలో ఉన్న సుమారు 5 తులాల బంగారం తాడు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ నీలయ్య, ఎస్‌ఐ గణేష్‌లు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మికి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలో గల ఆస్పత్రికి తరలించేందుకు ఆక్సిజన్‌ కలిగిన వాహనం లేకపోవడంతో కొంత సమయం జాప్యం ఏర్పడింది.   

మరిన్ని వార్తలు