వృద్ధ దంపతులను నిర్బంధించి..

13 Feb, 2019 08:37 IST|Sakshi
దుండగుల దాడికి గురైన వృద్ధ దంపతులు సత్యనారాయణమ్మ, నాగేశ్వరరావు

రూ.1.14 లక్షల సొత్తు చోరీ

తూర్పుగోదావరి, కడియం (రాజమహేంద్రవరం రూరల్‌): కడియపులంకల పరిధిలో హైవేపై హోటల్‌ నిర్వహిస్తున్న వృద్ధ దంపతులను నిర్బధించి వారి వద్ద రూ.49 వేలు సహ రూ.1.14 లక్షల సొత్తును చోరీ చేసి ఇద్దరు ఉడాయించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మంగళవారం ఉదయం ఈ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు పెనుమాక సత్యనారాయణమ్మ, నాగేశ్వరరావు దంపతులు, పోలీసుల కథనం ప్రకారం.. కడియపులంకలోని హైవేపై గంగుమళ్ల నర్సరీ సమీపంలో బాధితులు హోటల్‌ నిర్వహిస్తున్నారు. పనులు ముగించుకుని సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిద్రకు ఉపక్రమించారు.

ఆ సమయంలో సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు యువకులు వీరు ఉండే పాకలోకి ప్రవేశించి వారిద్దరినీ కదలకుండా పట్టుకున్నారు. సత్యనారాయణమ్మ మెడలో ఉన్న మూడు కాసుల పుస్తెల తాడు, చెవి లోలకులను బలవంతంగా తీసేసుకున్నారు. పుస్తెల తాడుకు ఉన్న తాళంతో గళ్లా పెట్టె తెరిచి రూ.49 వేలు, చెవి లోలకులు, రెండు ఉంగరాలు, సెల్‌ఫోన్, రెండు కోడిపుంజెలను చోరీ చేశారు. బలవంతంగా లాక్కుపోయాని సత్యనారాయణ విలపించింది. వృద్ధుడు కొంతకాలంగా అస్వస్థతతో ఉండడంతో హోటల్‌ను కూడా సరిగ్గా తీయడం లేదు. ఆస్పత్రికి తీసుకువెళతామన్న ఉద్దేశంతో పోస్టాఫీసులో దాచుకున్న రూ.30 వేలు, ఇద్దరి వద్ద అప్పు చేసిన రూ.19 వేలను దుండగులు పట్టుకుపోయారని వారు వాపోయారు. ఈ విషయాన్ని బంధువులకు తెలియజేసిన తరువాత మంగళవారం ఉదయం వారు పోలీసులను ఆశ్రయించారు. కడియం ఎస్సై బీవీ సుబ్బారావు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుల వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ టీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వృద్ధులకు తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు