షిర్డీ సాయిబాబా ఆలయంలో దొంగతనం

1 Dec, 2018 11:37 IST|Sakshi
దండమూడి గ్రామంలోని షిర్డీ సాయిబాబా దేవాలయం

హుండీ పగులగొట్టి నగదు అపహరణ

సీసీ కెమెరాల బాక్స్, టీవీలు సైతం...

క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లతో దర్యాప్తు

గుంటూరు, చిలకలూరిపేటరూరల్‌: అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం తాళాలు పగులకొట్టి ఆలయంలో చోరీ చేశారు. ఈ సంఘటన మండలంలోని దండమూడి గ్రామ ప్రవేశంలో ఉన్న షిర్డీ సాయిబాబా దేవాలయంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆలయ ట్రస్టీ బుర్రా వీరాస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్‌ అండ్‌ బీ రహదారి సమీపంలో ఉన్న సాయిబాబా, దుర్గాదేవి ఆలయ ప్రధాన గేట్లు తాళాలు ధ్వంసం చేసి ఆలయంలోని హుండీని పగులకొట్టి అందులోని రూ.5,000 నగదు, సీసీ కెమారాల బాక్స్, టీవీలను చోరీ చేసినట్టు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ సీఐ ఎస్‌.విజయ చంద్ర, ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం బృందం వేలిముద్రలను నమోదు చేశారు. డాగ్‌ స్క్వాడ్‌ ఆలయం వద్ద నుంచి మానుకొండవారిపాలెం వెళ్లింది. అక్కడి నుంచి వేలూరు మీదుగా చిలకలూరిపేటకు చేరింది. ఈ మేరకు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు