ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం.. సీసీటీవీ ఫుటేజీతో బట్టబయలు

16 Sep, 2023 14:10 IST|Sakshi

ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికులు అక్రమంగా బంగారం, డ్రగ్స్‌ తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు తరుచూ రావడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం చూపించారు. అది కూడా ప్రయాణికుడికి సంబంధించిన బ్యాగ్‌ నుంచి డబ్బులు, వస్తువులు కొట్టేశారు. ఈ షాకింగ్‌ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో జరిగింది. అయితే జూన్‌ 29న జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా వెలుగులోకి చ్చింది.

అసలేం జరిగిందంటే.. మియామి ఎయిర్‌పోర్టులోని చెక్‌ పాయింట్‌ వద్ద ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ప్రయాణికుల సామాన్లను భద్రపరుస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ స్కానర్‌ మెషిన్‌పై ఉంచిన బ్యాగ్‌లో నుంచి  600 డాలర్లను కాజేశారు. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ.. ఎవరికి కనపడకుండా మెల్లగా ఆ డబ్బులను బ్యాగ్‌ నుంచి కాజేసి తన జేబులో వేసుకున్నారు. డబ్బులతోపాటు ఇతర వస్తులను సైతం దొంగిలించాడు.

ఈ దృశ్యాలన్నీ ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రయాణికుల వస్తువులు కనిపించకపోవడంతో.. అక్కడున్న సెక్యురిటీ కెమెరాలు పరిశీలించగా  దొంగతనం విషయం బయటకు వచ్చింది.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితులను టీఎస్‌ఏ సిబ్బంది 20 ఏళ్ల జోస్యు గొంజాలెజ్, 33 ఏళ్ల లాబారియస్ విలియమ్స్‌గా గుర్తించారు. వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు  అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు నిందితులు కలిసి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు రోజు దాదాపు వెయ్యి డాలర్లు దొంగిలించినట్లు అంగీకరించారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ముగ్గురిని స్క్రీనింగ్‌ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించమని, చోరీకి పాల్పడిన వారిని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించామని టీఎస్‌ఏ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు