‘బంగారు’ బ్యాగు కథ సుఖాంతం!

13 Dec, 2019 11:49 IST|Sakshi
పోగొట్టుకున్న ఆభరణాల బ్యాగును రమేష్‌ దంపతులకు అందజేస్తున్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులు

రైలులో ఆభరణాలున్నబ్యాగును మరచిపోయిన దంపతులు

ఆరుగంటల్లోనే ఛేదించిన ఆర్‌పీఎఫ్‌ పోలీసులు

అనంతపురం , గుంతకల్లు: రైలు ప్రయాణం చేస్తూ బ్యాగు పోగొట్టుకున్న దంపతులకు తిరిగి ఆ బ్యాగును ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అప్పగించిన ఘటన గురువారం గుంతకల్లులో చోటు చేసుకుంది. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను ఆ దంపతులకు అప్పగించారు. ఆర్‌పీఎఫ్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపిన మేరకు..  ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన రమేష్‌ లక్ష్మీనరసయ్య, ప్రసన్న దంపతులకు ఈ యేడాది నవంబర్‌ 21న వివాహమైంది. రమేష్‌ మహారాష్ట్రలోని పూణె నగరంలో విమానగర్‌లో ఉన్న ఐటీ కంపెనీలో క్యాంటీన్‌ నిర్వహిస్తున్నాడు. రమేష్‌ దంపతుల స్వగ్రామం కనిగిరి. వివాహానంతరం అత్తగారింట్లో పండుగ ముగించుకున్న రమేష్‌ దంపతులు పూణె నగరానికి వెళ్లడానికి కోయంబత్తూరు – లోకమాన్యతిలక్‌ టెర్మినల్‌ (రైలు నం–11014) కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు టిక్కెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్నారు. బుధవారం కనిగిరి నుంచి హుబ్లీ ప్యాసింజర్‌ రైలులో బయలుదేరి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గుంతకల్లు రైల్వే జంక్షన్‌ చేరుకున్నారు. గుంతకల్లు నుంచి కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైలులో పూణె నగరానికి వెళ్లాల్సి ఉంది.

అయితే రమేష్‌ దంపతులు పొరపాటున కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బదులుగా బెంగుళూరు – ముంబై ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (నం–11302) రాత్రి 12.30 గంటల సమయంలో ఎక్కారు. వీరిని రైలులో విధి నిర్వహణలో ఉన్న టీటీఈ ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైలేనా? కాదు ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అని చెప్పడంతో రమేష్‌ దంపతులు హడావుడిగా రైలు నుంచి దిగారు. రైలు దిగే సమయంలో రమేష్‌ దంపతులు తీసుకొచ్చిన 6 లగేజ్‌ బ్యాగుల్లో పొరపాటున ఒక దాన్ని ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనే వదిలేశారు. వదిలేసిన బ్యాగులో సుమారు 20 తులాల బంగారం, అర కిలో వెండి ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదు ఉందంటూ లబోదిబోమన్నారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై కన్నీరు మున్నీరవుతున్న రమేష్‌ దంపతులను ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ హర్షవర్ధన్‌ విచారించారు. అప్రమత్తమైన ఎస్‌ఐ హర్షవర్ధన్‌ ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్‌ క్రైం పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ దేవప్రకాష్, కానిస్టేబుల్‌ ఈరే‹ష్‌లకు బ్యాగు గురించి సమాచారం అందించారు. వారు రైలంతా గాలించి ఆఖరికి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ దంపతులను గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆర్‌పీఎఫ్‌ పోలీసుస్టేషన్‌కు పిలిపించి పోగొట్టుకున్న బ్యాగును అందజేశారు.

సంతోషంగా ఉంది
ఒక రైలుకు బదులు మరొక రైలు ఎక్కి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగు పోగొట్టుకోవడం ఎంతో బాధ కల్గించింది. ఆర్‌పీఎఫ్‌ పోలీసుల చాకచక్యం, అప్రమత్తతో 6 గంటల్లోనే మా ఆభరణాలు దొరకడంతో చాలా సంతోషంగా ఉంది.–రమేష్‌ లక్ష్మీనరసయ్య దంపతులు

మరిన్ని వార్తలు