టీడీపీ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

22 Oct, 2018 02:14 IST|Sakshi
పట్టుబడిన నగదుతో నిందితులు

  ‘హుండీమనీ’పై కేసు నమోదు  

  ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నారంటూ ఆరోపణలు 

  నిందితుల జాబితాలో ఐదుగురి పేర్లు 

  ఎఫ్‌ఐఆర్‌లో ‘తెలుగు తమ్ముడు’ అనిల్‌ పేరు 

  మరో హుండీ ముఠా గుట్టురట్టు 

  నలుగురి పట్టివేత, రూ.2.50 కోట్లు స్వాధీనం 

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ ద్రవ్య మార్పిడి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. సాధారణంగా హుండీ, హవాలా దందాలకు సంబంధించిన వ్యక్తులు, నగదు చిక్కినప్పుడు పోలీసులు వారిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. అయితే బుధవారం చిక్కిన రాష్ట్ర తెలుగు యువత వైస్‌ ప్రెసిడెంట్, జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ సెక్రటరీ వల్లభనేని అనిల్‌కుమార్‌ డ్రైవర్‌ తదితరులను ఆదాయపుపన్నుశాఖకు అప్పగించడంతోపాటు వారిపై సుల్తాన్‌బజార్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఐదుగురినీ నిందితులుగా పేర్కొన్న పోలీసులు అనిల్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో అనిల్‌తోపాటు మరికొందరు ‘టీడీపీ పెద్దలనూ’ విచారించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ సమీపంలోని పూజ ఫ్యాషన్స్‌ స్టోర్స్‌లో నగదుమార్పిడిపై సమాచా రమందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం దాడి చేసిన విషయం విదితమే. అనిల్‌ డ్రైవర్‌ పుప్పల్ల మహేశ్, అతడి బావమరిది డి.శ్రీనివాసరావులతోపాటు ఆ దుకాణం యజమాని నరేశ్‌ తండ్రి గుమన్‌సింగ్‌ రాజ్‌ పురోహిత్, సిరిసిల్ల అవినాశ్, నేపాల్‌సింగ్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.59,00,500 స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని తన యజమానే ఇచ్చారని మహేశ్‌ వెల్ల డించాడు. రూ.50 లక్షలు పూజ ఫ్యాషన్స్‌ యజమా నికి, రూ.10 లక్షలు అవినాష్‌కు ఇవ్వాలని అనిల్‌ స్నేహితుడు వర్మ సూచించారని వెల్లడించాడు. ఈ మొత్తాన్ని జగిత్యాల్లో ఉన్న కళ్యాణ్‌ డ్రెస్సెస్‌కు పంపేందుకు హుండీ ఏజెంట్లు ప్రయత్నించారని టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది.

ప్రాథమికంగా ఈ కేసులో తదుపరి చర్యల నిమిత్తం ఐదుగురితోపాటు నగదునూ ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నగదు తరలింపు వ్యవహారంపై ఎన్నికల సంఘానికీ సమాచారమిచ్చింది. ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను బట్టి ఈ నగదును జగిత్యాలతో ఓటర్లకు పంపిణీ చేయడానికే తీసుకువెళ్తున్నట్లు గుర్తించా రు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుల్తాన్‌బజార్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో శనివారం కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అనిల్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. సైఫాబాద్‌కు చెందిన వర్మ ఎవరనే కోణంలో ప్రధానంగా ఆరా తీయనున్నారు. ఈ నగదు దొరకడానికి ఒకరోజు ముందు చిత్రపురి కాలనీలో జరిగిన సమావేశం ఏమిటి? దానికి టీడీపీ తరఫున ఎవరె వరు హాజరయ్యారు? వారికి, ఈ నగదు సరఫరాకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాలపై దృష్టి పెట్టారు. దీనికోసం మరికొందరు టీడీపీ నేతలకూ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. వీరి సమాధానా ల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.  

మరో రూ.2.5 కోట్లు స్వాధీనం... 
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొన్ని రోజులుగా అక్రమ ద్రవ్యమార్పిడిపై నిఘా ముమ్మరం చేశా రు. 2 దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలో అంతర్గతంగా జరిగే దాన్ని హుండీ అని అంటారు. బుధవారం టీడీపీ నేతలకు చెందిన రూ.59 లక్షలు దొరకగా.. తాజాగా ఆదివారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మరో ముఠా గుట్టురట్టు చేసి రూ.2.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన పాటిల్‌ జయేశ్‌ అనే జ్యువెలరీ వ్యాపారి 2010లో నగరానికి వచ్చి అబిడ్స్‌లో స్థిరపడ్డాడు. అతడి ప్రవృత్తి హుండీ దందా. రూ.లక్షకు రూ.600 చొప్పున కమీషన్‌ తీసుకునే జయేశ్‌ ఈ దందా కొనసాగిస్తున్నాడు. ఇతడి వద్ద వన్‌రాజ్, పాటిల్‌ అశ్విన్, నవీన్‌ పనిచేస్తున్నారు.

ఆదివారం ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారంటూ పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లుకు సమాచారమందింది. ఆయన నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని రాంకోఠిలో వన్‌రాజ్, అశ్విన్‌ను పట్టుకు న్నారు. వీరి వద్ద రూ.1.8 కోట్లు, ఒక బైక్‌ను స్వాధీ నం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు జయేశ్‌ ఇంటిపై దాడి చేసి జయేశ్‌తోపాటు నవీన్‌ ను పట్టుకుని రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని ఓ ఏజెంట్‌ సూచన మేరకు రూ.1.8 కోట్లను రాంకోఠిలో ఓ వ్యక్తికి డెలివరీ చేస్తున్నట్లు తేలింది. ఈ కేసును ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. 

మరిన్ని వార్తలు