అమీన్‌పూర్‌ ఘటన; వెలుగులోకి అసలు నిజం

24 Jan, 2020 15:07 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : అమీన్‌పూర్‌ బాలిక అత్యాచారం, హత్య ప్రయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మైనర్‌ బాలికపై అసలు అత్యాచారం జరగలేదని, బాలిక తప్పుడు సమాచారం ఇచ్చిందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తనను నలుగురు వ్యక్తులు  అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని అమీన్‌పూర్‌లోని ఓ బాలిక గురువారం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. అసలు బాలికపై అత్యాచారమే జరగలేదని స్పష్టం చేశారు. బాలిక తన ఇష్టంతోనే సందీప్‌ అనే యువకిడితో సినిమాకు వెళ్లిందని పేర్కొన్నారు. సినిమాలకు వెళితే అమ్మ తిడుతుందని భయంతో బాలిక నాటకాలు ఆడిందని తెలిపారు. (‘అమీన్‌పూర్‌లో బాలిక గ్యాంగ్‌రేప్‌? )

తనను సినిమాకు తీసుకెళ్లి అనంతరం నిర్శానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సందీప్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సందీప్‌పై ఫోక్సో చట్టం 12, ఐపీసీ 509 సెక్షన్ల కింద అరెస్టు చేశామని తెలిపారు. ఇంటి యజమాని రవిగౌడ్‌, బాలిక తల్లిదండ్రులు తప్పుడు వీడియో చిత్రీకరించి, అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. మైనర్‌ బాలికపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసినందుకు ఇంటి యజమానిపై కూడా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేసి ప్రజలను గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించారు. నిందితులకు కఠినంగా శిక్షలు అమలు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు