స్కూల్‌ బెల్ట్‌తో మిస్టరీ వీడింది

5 May, 2018 11:59 IST|Sakshi
నిందితుడు బబ్లూ

సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్‌ బెల్ట్‌ సాయంతో తల్లికొడుకుల హత్య కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తన గురించి చిన్న ఆనవాలు కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితుడిని.. అతి కష్టం మీద పోలీసులు అరెస్ట్‌ చేయగలిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌ మాల్దాకు చెందిన బబ్లూ కుమార్‌ మోందాల్‌(29) ఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉండే సావిత్రి ఘోష్‌ అనే వితంతువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

చుట్టుపక్కల వారిని మాత్రం తానే ఆమె భర్తనని బబ్లూ నమ్మించసాగాడు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం బబ్లూకు యాక్సిడెంట్‌ అయి కాలికి గాయమైంది. అయితే అప్పటి నుంచి సావిత్రి తనను నిర్లక్ష్యం చేస్తూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. గత నెల 25న ఆమెకు మద్యం తాగించి గొంతుకోసి చంపాడు. ఆపై 8 ఏళ్ల ఆమె కొడుకును కూడా అదే రీతిలో చంపి పరారయ్యాడు. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బబ్లూకు సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా పోలీసులకు లభించలేదు. దీంతో పోలీసులకు ఈ కేసు మిస్టరీ ఛాలెంజింగ్‌గా మారింది. 

బెల్ట్‌ ఆధారంగా... సావిత్రి భర్తగా చెప్పుకున్న బబ్లూపైనే పోలీసులకు అనుమానం మొదలైంది. కానీ, అతనికి సంబంధించి ఒక్క చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. చివరకు అతని పేరు, ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌ కూడా ఎవరికి తెలీకపోవటంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. ఇంతలో బాలుడి స్కూల్‌బెల్ట్‌ పై స్కూల్‌ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్‌ వివరాల్లో పిల్లాడి దరఖాస్తు ఫామ్‌లో ఉన్న ఫోటో(తండ్రి స్థానంలో బబ్లూ ఫోటో ఉంది) ఆధారంగా ఆచూకీ కోసం యత్నించారు. చివరకు అతను మాల్దాకు చెందిన వ్యక్తి అన్న సమాచారం దొరకటంతో సౌత్‌ ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ‘నిందితుడు కనీసం ఫోన్‌ కూడా వినియోగించేవాడు కాదు. దారినపోయే వారి ఫోన్‌ అడిగి తన బంధువులకు కాల్స్‌ చేసేవాడు. దీంతో అసలు అతను ఎక్కడ ఉన్నాడన్నది కనుక్కోవటం కష్టతరంగా మారింది. అయితే ఆ బంధువుల సాయంతోనే చివరకు అతన్ని పట్టుకున్నాం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బుధవారం జార్ఖండ్‌లోని షహిబ్‌గంజ్‌ ప్రాంతంలో చివరకు బబ్లూను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు