క్రికెట్‌ స్టేడియంలో రక్తపు ముద్దలు

19 May, 2018 17:36 IST|Sakshi
పేలుళ్ల అనంతరం స్టేడియంలో దృశ్యాలు

కాబూల్‌: ఉగ్రదాడితో అఫ్ఘనిస్థాన్‌ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం రాత్రి నంగర్‌హర్‌ ప్రొవిన్స్‌లోని ఓ క్రికెట్‌ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి.  ఘటనలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. రంజాన్‌ మాసం ప్రారంభం కావటంతో జలాలాబాద్‌లో ఓ ఎన్జీవో సంస్థ నైట్‌టైమ్‌ టోర్నమెంట్‌ను నిర్వహించింది. శుక్రవారం మ్యాచ్‌ను వీక్షించేందుకు వందలాది మంది ప్రేక్షకులు స్పింగర్‌ క్రికెట్‌ స్టేడియానికి వచ్చారు. ఆ సమయంలో వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రక్తపు ముద్ధలు చెల్లాచెదురుకాగా, హాహాకారాలతో ప్రేక్షకులు పరుగులు తీశారు. మూడు శక్తివంతమైన బాంబులు పేలాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు ‘అష్రఫ్‌ ఘని’ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు