CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు..! 

10 Nov, 2023 08:10 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 10) ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. సెమీస్‌ బెర్త్‌పై ఆశ చావని ఆఫ్ఘనిస్తాన్‌ ఈ మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడాలని భావిస్తుంది. అయితే వారు సెమీస్‌కు చేరడం అంత ఈజీ కాదు. దాదాపుగా అసాధ్యం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్లు అద్భుతమైన పోరాటాలు చేసినప్పటికీ.. అన్ని విభాగాల్లో పటిష్టమైన సౌతాఫ్రికా దగ్గర పప్పులు ఉడకకపోవచ్చు.   

438 పరుగుల తేడాతో గెలిస్తేనే..
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు చేరాలంటే సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో 438 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఒక్కసారైన కనీసం 300 స్కోర్‌ దాటని ఆఫ్ఘన్లకు ఇది స్థాయికి మించిన పనే అవుతుంది. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ దుస్థితి ఏర్పడింది.

ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ విజయం సాధించి ఉంటే, నాలుగో సెమీస్‌ బెర్త్‌ కోసం పోటీ ఎన్నడూ లేనంత రసవత్తరంగా ఉండేది. ప్రస్తుతానికి న్యూజిలాండ్‌ అనధికారికంగా సెమీస్‌కు చేరుకోగా.. సాంకేతికంగా పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లకు సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ జరిగే అవకాశం ఉంది. 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్‌ ఖరారైపోయింది. సెమీస్‌కు ముందు మరో మూడు లీగ్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 11న ఆసీస్‌, బంగ్లాదేశ్‌ మధ్య నామమాత్రపు మ్యాచ్‌, అదే రోజు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌, 12న భారత్‌,నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్‌ జరుగుతుంది.

చదవండి: పాక్‌ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్‌ ఓడినా ఇంటికే..!

మరిన్ని వార్తలు