స్నేహితుడే హంతకుడు

2 Apr, 2018 07:15 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకట్రావు

ఏడేళ్ల కిందటి హత్య కేసు ఛేదన

తాగిన మైకంలో డబ్బు కోసం వేధిస్తుండటంతో విసుగు చెందిన స్నేహితుడు పథకం ప్రకారం అతడిని హత్య చేశాడు. గుర్తుపట్టకుండా పెట్రోలు పోసి తగులబెట్టడంతో కేసు మిస్టరీగా మారింది. ఏడేళ్ల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. నిందితులను అరెస్ట్‌ చేశారు.

బుక్కరాయసముద్రం:ఉప్పరపల్లి గ్రామ పొలాల్లో 2011లో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో ఐదుగురు నిందితులను ఇటుకలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్, సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో కట్ల శ్రీకాంత్, వసంతం బ్రహ్మయ్య (అనంతసాగర్‌ కాలనీ), జూటూరు మహేష్, సాకే సంజీవరాయుడు (విజయనగర్‌ కాలనీ), కుంచపు రాజు (భగత్‌సింగ్‌ కాలనీ) ఉన్నారు.

హత్య నేపథ్యం..
నగరంలోని అనంత సాగర్‌ కాలనీకు చెందిన కట్ల శ్రీకాంత్‌ అలియాస్‌ç పడ అటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. మున్నానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ బోయ బంగి రవితో స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. తాగిన సమయంలో డబ్బులు ఇవ్వాలంటూ శ్రీకాంత్‌ను రవి కొట్టేవాడు. దీంతో విసిగి పోయిన శ్రీకాంత్‌ స్నేహితుడి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. 2011 జూన్‌ 22న హౌసింగ్‌బోర్డులో ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. శ్రీకాంత్‌ తన స్నేహితుడు మహేష్‌ సహాయంతో జాకీరాడ్‌తో బోయ రవి తలపై బాదాడు. కింద పడిన రవిని ఆటోలో వేసుకుని పండమేరు వద్ద ఉన్న వీర నారాయణమ్మ గుడి వద్ద వేశారు. జరిగిన విషయాన్ని శ్రీకాంత్‌ తన స్నేహితులు బ్రహ్మయ్య, సాకే సంజీవరాయుడు, కుంచపు రాజు, కర్రి రాజులకు సమాచారం ఇచ్చి పిలిపించుకుని, వారి సహాయంతో రవి శవాన్ని ఆటోలో వేసుకుని ఉప్పర పల్లి సమీపంలోని పొలాల్లో కంప చెట్ల మధ్య పడేసి, పెట్రోలు పోసి తగులబెట్టారు.

స్నేహితుల సమాచారంతో కదిలిన డొంక..
పాత కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదేశించిన నేపథ్యంలో డీఎస్పీ వెంకట్రావ్, సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌లు మిస్సింగ్‌ కేసులపై దృష్టి సారించారు. అప్పట్లో బోయ రవి, రాజా, ముస్తఫా మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. రాజా, ముస్తఫా కేసులు ట్రేస్‌ అయ్యాయని డీఎస్పీతెలిపారు. బోయ రవి కేసులో అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం ద్వారా మిస్టరీని ఛేదించామన్నారు. ఐదుగురు నిందితులనూ అరెస్ట్‌ చేశామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, వరప్రసాద్, గిరి, రాజగోపాల్, రమణ, మారుతీ ప్రసన్నలను డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు