వికృత చేష్టలు

21 Oct, 2017 13:31 IST|Sakshi
సస్పెన్షన్‌కు గురైన సైదాపురం ఎస్సై ఏడుకొండలు

వివాహితను వేధించిన సైదాపురం ఎస్సై సస్పెన్షన్‌

ఫిర్యాదు వెనుక కుట్రకోణం

జిల్లాలో గతంలో ఇదేతరహా ఘటనలు

ప్రతి ఘటనలోనూ వాయిస్‌ రికార్డులే కీలకం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో ఒక ఎస్సై వికృత చేష్టలకు దిగారు. వివాహిత.. అందులోనూ సర్పంచ్‌తో అసభ్యంగా మాట్లాడారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ సెల్‌ఫోన్‌లో సంభాషించాడు. చివరకు బాధితు రాలు ఎస్సై మాటలను వాయిస్‌ రికార్డ్‌ చేసి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు అందజేయడంతో సదరు ఎస్సైను తొలుత వీఆర్‌కు పంపారు. వెనువెంటనే సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు అనేకం చోటుచేసుకోగా.. కొన్ని కేసుల్లో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. మరికొన్ని కేసులను పట్టించుకోకపోవడం గమనార్హం. తాజా ఘటనలో సైదాపురం ఎస్సై కె.ఏడుకొండలు సస్పెండయ్యారు. దీనివెనుక వెనుక పాత వ్యవహారాలు, కుట్రకోణం దాగి ఉన్నాయని ఓ వర్గం చెబుతోంది.

కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఎస్సైగా..
2015 నుంచి సైదాపురం ఎస్సైగా పనిచేస్తున్న ఏడుకొండలు 2003లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత రిజర్వ్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. 2010లో సివిల్‌ ఎస్సైగా కన్వర్షన్‌ అయి నల్గొం డ రైల్వే, తెనాలి, వింజమూరులో ఎస్సైగా పనిచేశారు. సైదాపురం మండలం ఊటుకూరుకు చెందిన సర్పంచ్‌ మంచు పద్మజతో ఎస్సై అసభ్యకరంగా మాట్లాడారు. కొద్దిరోజుల నుంచి లైంగికంగా వేధించేలా మాట్లాడుతూ పరోక్షంగా కోరిక తీర్చమని ఒత్తిడి చేస్తూ సంభాషణలు జరిపినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో సర్పంచ్‌ పద్మజ గురువారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఎస్సై ఆమెతో మాట్లాడిన సంభాషణరికార్డులను అధికారులకు అందజేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఎస్సైను వీఆర్‌కు పంపగా శుక్రవారం దీనిపై ప్రాథమిక విచారణ నిర్వహించి ఎస్సైను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం వెనుక పొలం వివాదం ఉందని ఆరోపణలున్నాయి. పద్మజ కుటుంబసభ్యులకు, స్థానికంగా ఉన్న మోడుబోయిన సుబ్బారావుకు 1.5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం కొంతకాలంగా ఉంది.

ఈ క్రమంలో సుబ్బారావుకు, పద్మజ కుటుంబసభ్యుల మధ్య తరచూ గొడవలు జరగడం, సుబ్బారావు ప్రైవేటు కేసు దాఖలు చేయడంతో  పద్మజ కుటుంబ సభ్యులపై పోలీసులు మూడు పర్యాయాలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రెండు కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ వెంటనే ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం పద్మజ కుటుంబ సభ్యులను ఎస్సై ఏడుకొండలు ఒక కేసులో అరెస్ట్‌ చేశారు. ఆ కేసుకు సంబంధించి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వలేదు. దీంతో పద్మజ, ఎస్సై మధ్య వివాదం రావడంతో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ ఘటనపై సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇదే తరహా ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ఆరేళ్ల క్రితం బాలాజీనగర్‌ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన రామరాజు ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె హైదరాబాద్‌లో మీడియాను ఆశ్రయించి రామరాజుపై ఫిర్యాదు చేయడంతో అతడ్ని సస్పెండ్‌ చేశారు. ఇదే తరహాలో కలిగిరిలో ఓ సీఐ కూడా వివాహితను వేధించారు. అప్పుడూ వాయిస్‌ సంభాషణలతో సహా సదరు వివాహిత ఫిర్యాదు చేసింది. సదరు సీఐకి రాజకీయ పరపతి ఉండటంతో ప్రాథమికంగా విచారించి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఐదేళ్లలో జిల్లాలో ఈ తరహాఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొన్ని కేసుల్లో చర్యలు ఉంటున్నప్పటికీ కొందరి పోలీసుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు