మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

7 May, 2018 12:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భర్త వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన జి. రేఖ(30) లంగర్‌హౌస్‌కు చెందిన ఉజ్వల్‌ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అనంతరం చందానగర్‌లోని అపర్ణ గార్డినియా ప్లాట్‌నెంబర్‌ ఎ 801లో నివసిస్తున్నారు. దంపలిద్దరూ గచ్చిబౌలిలోని ఐబీఎం సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు వనస్థలిపురంలో అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

అంతేకాక భర్త ఎప్పుడూ అనుమానిస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఒత్తిడికి గురిచేశాయి. ఫోన్‌లో మాట్లాడే విషయంలో భర్త ప్రవర్తన కారణంగా వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు అధికమయ్యాయి. కాగా..  శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరు గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. ఇంటికి వచ్చాక గొడవపడి వేర్వేరు గదుల్లో నిద్రపోయారు.  ఆదివారం ఉదయం ఉజ్వల్ లేచి చూసే సరికి రేఖ ఫ్యానుకు చీరతో వేలాడుతూ కనిపించింది. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే రేఖ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు