కొడుకును కాపాడబోయి..తండ్రి గల్లంతు

7 Apr, 2018 06:35 IST|Sakshi
గల్లంతైన కాల్వ వద్ద పోలీసులు, బేల చూపులతో జహంగీర్‌ భార్య, కుమారుడు

ఖమ్మంరూరల్‌ : మండలంలోని ముత్తగూడెం వద్ద నాగార్జున సాగర్‌ ప్రధాన కాల్వలో పడిన కుమారుడిని కాపాడబోయిన తండ్రి.. నీటిలో గల్లంతయ్యా డు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... నల్గొండ జిల్లా మిర్యాలగూడేనికి చెందిన ఎండీ జహంగీర్‌(35), తన భార్య ఫర్జాన్, కుమారుడు అఫ్రోజ్, కుమార్తె సమీనతో కలిసి కొంత కాలంగా ముత్తగూడెంలో నివసిస్తున్నాడు. అక్కడే చికెన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం భార్యాపిల్లలతో కలిసి దుస్తులు ఉతికేందుకు సాగర్‌ కాల్వ వద్దకు వెళ్లాడు. అక్కడ దుస్తులు ఉతుకుతుండగా కుమారుడు అఫ్రోజ్, కాలుజారి కాల్వలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు తండ్రి జహంగీర్‌ వెంటనే కాల్వలోకి దూకాడు. సరిగ్గా అదే సమయంలో కాల్వ పక్కన చేపలు పడుతున్న మత్స్యకారులు స్పందించి, ముందుగా అఫ్రోజ్‌ను బయటకు లాగారు. జహంగీర్‌ను కూడా కాపాడేందుకు ప్రయత్నించారు. అతడికి ఈత వచ్చు. కానీ, వరదఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకు పోయాడు.. గల్లంతయ్యాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై ఎం.చిరంజీవి పరిశీలించారు. అప్పటికే పొద్దుపోవడంతో గాలింపు సాధ్యపడలేదు. జహంగీర్, ప్రతి రోజూ ఈ కాల్వలో ఈత కొడుతుండేవాడు. కేసును ఎస్సై నమోదు చేశారు.

మరిన్ని వార్తలు