మాజీ క్రికెటర్‌కు సుప్రీం ఊరట

15 May, 2018 12:32 IST|Sakshi

న్యూఢిల్లీ : నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కొట్టి చంపారనే కేసులో మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పర్యాటక మంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్ధూను సుప్రీం కోర్టు నిర్ధోషిగా తేల్చింది. 30 ఏళ్ల క్రితం1988 డిసెంబర్‌ 27న సిద్ధూ అతని స్నేహితుడు రూపీందర్‌ సింగ్‌ సంధు పాటియాలలోని రోడ్డుపై తమ జీప్సీని ఆపారు. అదే దారిపై వెళుతున్న గుర్నాం సింగ్‌.. వాహనాన్ని పక్కకు తొలగించాల్సిందిగా సిద్ధూ, సంధులను కోరాడు. ఇది వారి మధ్య గొడవకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన గుర్నాం ఆస్పత్రికి తరలించిన తర్వాత మృతిచెందాడు. సిద్ధూ గాయపరచడం వల్లే గుర్నాం మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై విచారణ చేపట్టిన పంజాబ్‌, హర్యానా హైకోర్టు 2006లో సిద్ధూతోపాటు, సంధుకు లక్ష రూపాయల జరిమానాతో పాటు, మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. గుర్నాం వైద్య నివేదిక అస్పష్టంగా ఉందంటూ సిద్ధూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సిద్ధూ బాధితుడిని ఉద్దేశపూర్వకంగా గాయపరిచాడని నిర్ధారిస్తూ రూ వేయి జరిమానాను విధించింది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న సిద్ధూకు న్యాయ సహాయం చేయాలని సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నిర్ణయించారు. కానీ ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం సిద్ధూకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తలు