ముగ్గురు జడ్జీలతో ప్రమాణం చేయించిన సీజేఐ

10 Nov, 2023 05:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ, రాజస్తాన్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గురు వారం సుప్రీంకోర్టు జడ్జీలు గా ప్రమాణం చేశారు. వీరి నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య పూర్తి స్థాయి 34కు చేరింది. సుప్రీంకోర్టు భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జి మసీహ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ ప్రమాణం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శర్మ, రాజస్తాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మసీహ్, గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ మెహతాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ‘ఎక్స్‌’లో ప్రకటించారు. వీరి పేర్లను కొలీజియం ఈ నెల 6న ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేస్తున్న జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా

మరిన్ని వార్తలు