పొలిటికల్‌ నేతలపై క్రిమినల్‌ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు

9 Nov, 2023 11:46 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్‌ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు..  హైకోర్టులకు అప్పగించింది. 

వివరాల ప్రకారం.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్‌, న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ్‌ తెలిపారు.

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే..
►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. 
►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి
►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి
►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి.

మరిన్ని వార్తలు