ఏసీబీ ఉచ్చులో ఇద్దరు సర్వే అధికారులు

10 Jan, 2020 13:25 IST|Sakshi
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సర్వేయర్‌ రాజు, చైన్‌మెన్‌ చిత్తరంజన్‌లను ప్రశ్నిస్తున్న ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సురేష్‌బాబు

రూ. 27 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన వైనం

మండల సర్వేయర్, చైన్‌మెన్‌ అరెస్టు  

స్పందన 1440 కాల్‌కు  స్పందించిన ఏసీబీ అధికారులు

అమరావతి, సత్తెనపల్లి: పట్టా భూమిని అసైన్డ్‌లో చూపి లంచం డిమాండ్‌ చేసిన సర్వే అధికారులపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. రూ. 27 వేలు తీసుకుంటూ సత్తెనపల్లి మండల సర్వేయర్‌ ఎం.రాజు, చైన్‌మెన్‌ చిత్తరంజన్‌ పట్టుబడ్డారు. వారిద్దరినీ ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ ఎ.సురేష్‌బాబు నేతృత్వంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్‌నగర్‌కు చెందిన  శ్యామల సురేష్‌రెడ్డి తన భార్య శ్యామల నాగలక్ష్మి పేరు మీద పట్టణంలోని ఎఫ్‌సీఐ సమీపంలో 2,102 గజాల (43.5 సెంట్ల) స్థలం ఉంది. ఇది పక్కా పట్టా భూమిగా ఉండటంతో 2006 డిసెంబరులో కొనుగోలు చేశారు.  సురేష్‌రెడ్డి కుమారుడు శ్యామల సాయిఅచ్యుత రెడ్డి ఎంఎస్‌ చేయడానికి నగదు అవసరమైంది.

ఈ క్రమంలో ఆ భూమిని పట్టణంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పెట్టి విద్యా రుణం కింద నగదు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. లీగల్, ఇంజినీర్‌ రిపోర్టు అయిపోయాయి. స్థలాన్ని మార్ట్‌గేజ్‌కోసం సబ్‌ రిజిస్ట్రారు కార్యాల యానికివెళ్లగా 49/1ఏలో 3.25 ఎకరాలు కెనాల్‌ అసైన్డ్‌ భూమిగా చూపారు. దాని లోనే శ్యామల నాగలక్ష్మికి చెందిన 2,102 గజాల స్థలం కూడా ఉన్నట్లు చూపారు. దీంతో మార్ట్‌గేజ్‌ చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ అంగీకరించలేదు. 2019 అక్టోబరు 10న సురేష్‌రెడ్డి తహసీల్దారుకు అర్జీ పెట్టుకున్నాడు. 1960 నుంచి అడంగల్‌ కాపీ కోసం అర్జీ పెట్టగా 2019 నవంబరు 12న అడంగల్‌ ఇచ్చారు. పట్టా భూమిని కెనాల్‌ అసైన్డ్‌ భూమిగా చూపుతున్నారని, తనది పట్టా భూమి కనుక తన పని త్వరితగతిన పూర్తి చేయాలని 2019 నవంబరు 20న జిల్లా కలెక్టర్‌ను సురేష్‌రెడ్డి కలిసి విన్నవించుకున్నాడు.  పట్టాభూమిని అసైన్డ్‌లో వేశారని ఫిర్యాదు చేయగా స్పందించిన  కలెక్టర్‌ వెంటనే తహసీల్దారు కార్యాలయానికి ఫోన్‌ చేసి త్వరితగతిన రిపోర్టు పంపాలని ఆదేశించారు.

సర్వే అధికారుల బేరసారాలు.....
పని కోసం సురేష్‌రెడ్డి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చి సర్వేయర్‌ ఎం.రాజును కలువగా తనతో ఏదైనా పని ఉంటే చైన్‌మెన్‌ చిత్తరంజన్‌ను కలవమని సర్వేయర్‌ రాజు సూచించారు. రోజుల తరబడి సురేష్‌రెడ్డి తిరుగుతున్నప్పటికీ సర్వే అధికారులు పట్టించుకోలేదు. చైన్‌మెన్‌ చిత్తరంజన్‌ను కలిసి పని చేసి పెట్టాలని కోరడంతో విలువైన స్థలంగా భావించి ఎకరానికి ఎంత ఇస్తావంటూ చిత్తరంజన్‌ బేరసారాలకు దిగాడు. లంచం  ఇవ్వడం ఇష్టం లేని సురేష్‌రెడ్డి 1440 స్పందన కాల్‌కు ఫోన్‌ చేసి సర్వే అధికారుల అవినీతి గురించి వివరించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా పథకం రచించారు. ఆ ప్రకారం గురువారం సురేష్‌రెడ్డికి డబ్బు ఇచ్చి పంపగా చైన్‌మెన్‌ చిత్తరంజన్‌ను సురేష్‌రెడ్డి కలిశాడు. డబ్బు తీసుకుని ప్రస్తుత తహసీల్దారు కార్యాలయం వెనుక నిర్మాణంలో ఉన్న కార్యాలయం వద్దకు రమ్మని సురేష్‌రెడ్డికి చిత్తరంజన్‌ చెప్పాడు. సురేష్‌రెడ్డి అక్కడకు వెళ్లగా సర్వేయర్‌కు పని చేసేందుకు రూ. 15 వేలు, ఇతర ఆఫీసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 12 వేలు ఇవ్వాలని చైన్‌మెన్‌ చిత్తరంజన్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో రూ. 27 వేలు చిత్తరంజన్‌కు అందజేయగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐలు సి.హెచ్‌. రవిబాబు, జి.శ్రీదర్, ఎస్సై శ్రీనివాసమూర్తి, మరో నలుగురు సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు