నగరంలో తమిళనాడు ముఠా..

21 Dec, 2017 11:30 IST|Sakshi

దృష్టి మరల్చి దొంగతనాలు

వారంలో రెండు ఘటనలు

పోలీసుల అదుపులో నిందితుడు ?

వరంగల్‌ ,హన్మకొండ చౌరస్తా: దృష్టి మరల్చి దొంగతనాలు చేసే తమిళనాడుకు చెందిన దొంగలముఠా నగరంలో సంచరిస్తోంది. బ్యాంకులు, షాపింగ్‌ కాంప్లెక్సులు, ఆస్పత్రులు ఇలా పెద్ద మొత్తం డబ్బులతో వచ్చే ప్రాంతాలనే వారు టార్గెట్‌ చేసుకుని దోపిడీకి తెగబడుతున్నా రు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ సమీపంలో ఇదే పద్దతిలో దొంగతనం చేస్తుండగా మంగళవారం ఈ ముఠా సభ్యుడు పట్టుబడినట్లు సమాచా రం. అంతకుముందు సోమవారం విజయటాకీస్‌ దగ్గర మరో మహిళ నగలు దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది సాధ్యం కాకపోవడంతో చేతిలో పర్సుతో ఉడాయించారు.

సైగలతోనే..
తమిళనాడుకు చెందిన దొంగలు ఇద్దరు ముగ్గురు ఒక జట్టుగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో సంచరిస్తారు. ఈ సందర్భంగా విలువైన వస్తువులు, డబ్బులు ఉన్న వ్యక్తులను గుర్తిస్తారు. ఆ తర్వాత వారిని అనుసరిస్తూ అ నువైన సమయం కోసం ఎదురు చూస్తారు. ఆ తర్వాత తమ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తారు. మంగళవారం హెడ్‌క్వార్టర్‌ వద్ద జరిగిన ఘటనలో బా«ధితులు ఓ కారులో వచ్చి ఆగారు. డ్రైవర్‌ ముందు సీటులో కూర్చుని ఉండగా ముందు సీటులో ఉన్న వ్యక్తి, వెనక సీటులో ఉన్న వ్యక్తి కారు దిగి బ్యాంకులోకి వెళ్లారు. ఈ సమయంలో ఓ వ్యక్తి డ్రైవరు వద్దకు వచ్చి కింద పడిపోయిన డబ్బులు మీవేనా అన్నట్లుగా సైగ చేశాడు. డ్రైవరు ఆ డబ్బుల వైపు చూస్తుండగానే మరో వ్యక్తి కారు వెనక డోరు తీసి... అక్కడున్న డబ్బుల బ్యాగు తీసుకున్నాడు. డ్రైవర్‌ ఈ విషయాన్ని గమనించడంతో దొంగ దొంగ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో అక్కడ కరీంనగర్‌ బస్‌పాయింట్‌ వద్ద వేచి ఉన్న వ్యక్తులు ఆ దొంగను పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు బస్సులో పారిపోయారు. ఈ ఘటనలో తమ డబ్బులు తమకు దొరకడంతో పోలీసులతో ఫిర్యాదు చేయలేదు. మాటతీరును బట్టి వీరు తమిళనాడుకు చెందిన వారిగా తేలినట్లు సమాచారం. ఈ ఘటనలో దొంగలు రూ. 30,000లతో డబ్బులు ఉన్న బ్యాగును దోచుకునేందుకు ప్రయత్నించారు.

తొర్రూరుకు చెందిన దంపతులు సోమవారం హన్మకొండకు వచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో వేయిస్తంభాలగుడి వద్ద ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. భర్త ఆస్పత్రిలోకి వెళ్లగా మహిళ కారులో వేచి చూస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి అటుగా వచ్చి కింద పడిపోయిన డబ్బులు మీవేనా అన్నట్లుగా సైగ చేశాడు. ఏంటో చూద్దామని కారు విండో గ్లాస్‌ దించి చూడగా మెడలో గొలుసు తెంపేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో ఆమె చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగుతో పారిపోయాడు. ఈ ఘటనపై హన్మకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది. వీటిపై పోలీసుశాఖ విచారణ చేపడుతోంది.

మరిన్ని వార్తలు