టీడీపీలో మిగిలేదెవరో?

21 Dec, 2017 11:38 IST|Sakshi

‘దేశం’ నుంచి ఆగని వలసలు

కాంగ్రెస్‌లోకి మాజీమంత్రి యత్నం!

కుంతియా, కొప్పుల రాజుతో సంప్రదింపులు

మల్లు రవి ఇంట్లో రెండు దఫాలుగా చర్చలు

ఈనెల 26 తర్వాత ముహూర్తం ఖరారు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలుగుదేశం నుంచి వలసల పరంపరకు అడ్డుకట్ట వేసినా ఫలితం లేకుండా పోతుందా..? అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా..? ఆ పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా..? ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ కనుమరుగు కానుందా..? అంటే... జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే మూడు జిల్లాల అధ్యక్షులు, పది నియోజకవర్గాల ఇన్‌చార్జిలు టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో చేరారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ‘చెయ్యేత్తి’ జై     కొట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ఇరుపార్టీల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 26 తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుండటం పార్టీ వర్గాల్లో  కలకలం రేపుతోంది.

ఆగని వలసలు.. ‘దేశం’లో అయోమయం
ఉమ్మడి జిల్లాలో గతంలో జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన చింతకుంట విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి, చొప్పదండి ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కశ్యప్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు, హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్యాల రవీందర్‌రావు, మంథని నియోజకవర్గం ఇన్‌చార్జి కర్రు నాగయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. అందులో 10 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు కరువయ్యారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి ఒకరు కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, ఎస్సీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంతనాలతో పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మాజీ ఎంపీ మల్లు రవి గృహంలో చర్చలు కూడా జరిపారు. క్రిస్మస్‌ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీలో చేరేందుకు అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న సదరు నేత సైతం వలసబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.

రంగంలోకి చంద్రబాబు వేగులు
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీనీ ప్రథమ శ్రేణి నేతలు తలోదారి చూసుకున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతలు సైతం తమ భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కాకపోతే ఇకపార్టీ మారడం ఇబ్బందిగా పరిణమించే అవకాశాలు ఉండడంతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. టీడీపీలోనే ఉంటే రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలు తలెత్తుతుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు డోలాయమానంలో పడుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఈ నేపథ్యంలో వలసలు ఇలాగే జరిగితే పార్టీలో మిగిలేది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద టీడీపీకి గడ్డు రోజులు వచ్చాయని సొంత పార్టీలోనే బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు దూతలు ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో  ద్వితీయశ్రేణి నేతలకు పదవులు కట్టబెట్టేందుకు పలువురి పేర్లను పరిశీలించారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌లో సీనియర్‌ నేతలంతా వలసబాట పట్టడంతో పార్టీకి మూడు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల కోసం అధిష్టానం వెదకడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది.  

మరిన్ని వార్తలు