ఉపాధ్యాయా... ఇదేం పని!

11 Jan, 2020 12:42 IST|Sakshi
నిందితుడు సాయికృష్ణ ఇంటిలో విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఉపాధ్యాయుడు సాయికృష్ణ

ఏసీబీకి చిక్కిన ఉపాధ్యాయుడు

టెన్త్‌ ధ్రువపత్రాలు ఇచ్చేందుకు లంచం డిమాండ్‌

11440 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని

రూ.7వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ  

సాయికృష్ణను అరెస్టు చేసిన ఏసీబీ  

ఆయనో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు. దూర విద్య కేంద్రం కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నాడు. సమాజానికి దిక్సూచిగా నిలవాల్సిన ఆయన పక్కదారిలో పయనించాడు. విద్యార్థుల పట్ల ప్రేమను పంచి సన్మార్గంలో నడిపించే బోధనలు చేయాల్సిన ఆయన తన వృత్తి ధర్మాన్ని విస్మరించి అక్రమార్జనకు కక్కుర్తి పడ్డాడు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ధ్రువపత్రాల విషయంలో లంచం డిమాండ్‌ చేశాడు. బేరం కుదర్లేదు... తాను అడిగినంత ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. విద్యార్థులు ప్రాధేయపడ్డారు. కొద్దిగా లంచం తగ్గించి మిగతా మొత్తాన్ని ఇమ్మన్నాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన 11440 టోల్‌ఫ్రీ నంబరును ఓ విద్యార్థిని ఆశ్రయించింది. అంతే...ఏసీబీ రంగంలోకి దిగింది. పక్కా స్కెచ్‌తో అక్రమార్జనకు అలవాటు పడ్డ ఉపాధ్యాయుడును పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...

విజయనగరం, లక్కవరపుకోట: ఏసీబీ వలకు ఓ ఉపాధ్యాయుడు చిక్కాడు. మండలంలోని చందులూరు గ్రామంలో విద్యార్థులకు సంబంధించిన పదో తరగతి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఉపాధ్యాయుడు ఈదుబిల్లి సాయికృష్ణను ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి శుక్రవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి డీఎస్పీ నాగేశ్వరరావు అందించిన వివరాలు... ఈదుబిల్లి సాయికృష్ణ ఎల్‌.కోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో సార్వత్రిక విద్యాపీఠం(దూర విద్య) కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. కొత్తవలస మండలంలోని ప్రఖ్యాత ట్యుటోరియల్‌ ప్రైవేటు తరగతులు చెబుతున్న ఆర్‌.వెంకటరమణ దగ్గర కొందరు విద్యార్థులు ప్రైవేటుగా పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో దూర విద్యలో భాగంగా 2017 – 18 సంవత్సరంలో తొమ్మిది మంది విద్యార్థులు వెంకటరమణ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలను రాశారు. పరీక్షలు రాసిన వారంతా ఉత్తీర్ణులయ్యారు.

ఈ క్రమంలో ఉత్తీర్ణత ధ్రువపత్రాలను అందజేయాలని దూర విద్య కోఆర్డినేటర్‌ సాయికృష్ణను విద్యార్థులు కోరగా ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయిలు చొప్పున తొమ్మిది వేలు లంచం డిమాండ్‌ చేశాడు. తొమ్మిది మందిలో సంతోషి అనే విద్యార్థిని రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన 11440 టోల్‌ఫ్రీ నంబరుకు ఈ నెల 7న ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ట్యుటోరియల్‌లో పని చేస్తున్న వెంకటరావును సంప్రదించి వివరాలను సేకరించారు. వెంకటరావు కోఆర్డినేటర్‌ సాయికృష్ణకు ఫోన్‌ చేసి రూ.తొమ్మిది వేలు ఇవ్వలేమని చెప్పడంతో రూ.7వేలు తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు.  దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లును సాయికృష్ణకు తన గృహంలోనే అందజేసి విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకుంటుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాయికృష్ణను విచారించగా లంచం తీసుకున్నట్టు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి సాయికృష్ణను అరెస్టు చేసి విజయనగరం తరలించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు కె.సతీష్‌కుమార్, ఎం.మహేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా