తేలుకాటుకు విద్యార్థిని మృతి

6 Mar, 2019 13:19 IST|Sakshi
నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, (ఇన్‌సెట్లో) మృతి చెందిన వైష్ణవి (ఫైల్‌ )

చిత్తూరు, సదుం: బాగా చదివి ప్రయోజకురాలు కావాలన్నది ఆ విద్యార్థిని కల. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఎంతగానో తపన పడేది. ఎంతో ఇష్టంతో కష్టపడి చదివేది. కానీ విధి చిన్నచూపు చూసింది. తేలుకాటు రూపంలో మృత్యువు ఆ బాలిక ప్రాణాలను బలిగొంది. వివరాలు.. మండలంలోని సజ్జలవారిపల్లెకు చెందిన పార్థసారథి, సుగుణమ్మలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన వైష్ణవి (15) సదుం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఇంట్లో ఉన్న వైష్ణవి ఆదివారం రాత్రి కరెంటు పోవడంతో ఆవరణలోకి వచ్చి చీకట్లో కూర్చొంది. అక్కడే ఆరబెట్టిన చింతకాయలలో ఉన్న తేలు ఆమెను కాటు వేసింది.

హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను సదుం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పీలేరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు తిరుపతికి తరలించారు.  తిరుపతి స్విమ్స్‌లో వైష్ణవి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మంగళవారం ఆమె మృతదేహాన్ని వైఎస్సార్‌ సీపీ నాయకులు పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, రాజు, నాగరాజారెడ్డి, ఉపాధ్యాయులు సందర్శించి నివాళులు అర్పించారు. వైష్ణవి చదువులో ఎంతో చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు.

మరిన్ని వార్తలు