పోలీసులను పరుగులు పెట్టిస్తున్న అజ్ఞాత వ్యక్తులు

30 Apr, 2019 09:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: బాంబు బెదిరింపులు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. శ్రీలంకలో సాగిన వరుస పేలుళ్ల తదుపరి కంట్రోల్‌ రూమ్‌కు బెదిరింపు కాల్స్‌ రాక క్రమంగా పెరిగింది. ఇది కాస్త పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తమిళనాట వరుస పేలుళ్లు జరగనున్నట్టుగా బెదిరింపులు ఇవ్వడం, మరో వ్యక్తి ఫోన్‌ చేసి కాసేపట్లో మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఇంటిని బాంబులతో పేల్చి వేయబోతున్నట్టుగా హెచ్చరించడం పోలీసులకు శిరోభారంగా మారింది. రాష్ట్రంలోని పోలీసు స్టేషన్‌లకు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, కంట్రోల్‌ రూమ్‌లకు తరచూ వస్తున్న బెదిరింపు కాల్స్‌ పోలీసుల్ని పరుగులు తీయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుస పేలుళ్ల తదుపరి తమిళ పోలీసులతో చెడుగుడు ఆడుకునే వాళ్లు పెరిగినట్టున్నారు. గత మూడు నాలుగు రోజుల్లో ఒకే కంట్రోల్‌ రూమ్‌కు అనేక బెదిరింపు కాల్స్‌ రావడం పోలీసుల్ని పరుగులు తీయించడమే కాదు, ఆ కాల్స్‌ చేసిన వారిని పట్టుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. చెన్నైలో బాంబులు, మదురైలో బాంబులు, అదిగో తీవ్రవాది, ఇదిగో అజ్ఞాత వ్యక్తులు అంటూ వచ్చిన ఫోన్‌కాల్స్‌ చివరకు సీఎం పళనిస్వామి మీదకు ఆదివారం మళ్లాయి. సీఎం పళని స్వామిని హతమారుస్తామంటూ దిండుగల్‌ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌ మీద విచారణ సాగుతోంది. ఆ కాల్‌ చేసిన యువకుడిని  గుర్తించినా, అతడు అజ్ఞాతంలో ఉండటంతో గాలింపునకు ప్రత్యేక బృందాల్ని రంగంలో దించక తప్పలేదు. ఈ విచారణ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు ఆదివారం రాత్రి మరో రెండు కాల్స్‌ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాయి.

వరుస పేలుళ్లు తప్పవు
ఆదివారం రాత్రి ఎగ్మూర్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు తొలుత ఓ కాల్‌ వచ్చింది. తాను స్వామిని మాట్లాడుతున్నట్టు గంభీర గళం వినిపించడంతో తమ ఉన్నతాధికారుల్లో ఎవరో ఒకరై ఉంటారనుకుని అక్కడి సిబ్బంది చెప్పండయ్యా అంటూ మర్యాద పూర్వకంగా పలకరించారు. అయితే, ఆ వ్యక్తి అవతలి వైపు నుంచి పదే పదే స్వామిని.. స్వామిని అంటూ చివరకు శ్రీలంక బాంబు పేలుళ్లను గుర్తు చేస్తూ, తమిళనాట మరో మూడు నెలల్లో ఇలాంటి వరుస పేలుళ్లు జరగబోతున్నాయని, ఇందుకు తగ్గ పథకం, వ్యూహాలు రచించబడ్డట్టుగా హెచ్చరించి కట్‌ చేశాడు. ఇది బెదిరింపు కాల్‌లో భాగంగానే భావించినా, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతాధికారులకు కంట్రోల్‌రూమ్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటెలిజెన్స్‌ వర్గాలను అలర్ట్‌ చేశారు. ఆ వర్గాలు మరింత నిఘాతో వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాల్ని ఉన్నతాధికారులకు చేర వేయాల్సిన పరిస్థితి. అలాగే, ఆ బెదిరింపు కాల్‌ మదురై నుంచి వచ్చినట్టు గుర్తించారు. మదురై సైతం తీవ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో ఉండటంతో ఈ బెదిరింపు ఇచ్చిన వ్యక్తి కోసం ఆ జిల్లా పోలీసులు తీవ్రంగానే గాలించే పనిలో పడ్డారు. అలాగే, ఇదే కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన మరో కాల్‌లో గ్రీన్‌వేస్‌ రోడ్డులోని రవాణ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఇంట్లో బాంబుల్ని అమర్చామని, అవి పేలబోతున్నట్టుగా హెచ్చరించడంతో, ఆయన ఇంటి వద్ద పోలీసు హడావుడి పెరిగింది. గ్రీన్‌వేస్‌ రోడ్డులోనే సీఎం పళనిస్వామితోపాటుగా ఇతర మంత్రులు అందరూ ఉండటంతో, ఆ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టక తప్పలేదు. ఇవన్నీ బూచీలుగా తేలినా, ఈ బెదిరింపులు ఇస్తున్న వ్యక్తులు తమ చేతికి చిక్కకుండా తప్పించుకుంటుండటం పోలీసుల శిరోభారంగా మారింది. ఈ బెదిరింపు కాల్స్‌ చేసిన వాళ్లు ఒక్కరు చిక్కినా, మరో కాల్‌ రాకుండా చేసే రీతిలో వారితో కఠినంగా వ్యవహరించేందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నారు.

ఆ ఇద్దరు ఎవరు?
శ్రీలంకలో బాంబుదాడికి పాల్పడ్డ తీవ్రవాదులు తమిళనాడులోకి చొరబడే అవకాశం ఉందన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. దీంతో నాగపట్నం, వేదారణ్యం, రామేశ్వరం తీరాల్లో భద్రతను మరింతగా పెంచి ఉన్నారు. గస్తీ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వేదారణ్యం నాలుగు రాళ్ల తీరంలో ఇద్దరు యువకులు గస్తీలో ఉన్న పోలీసులకు పట్టుబడ్డారు. అర్ధరాత్రి వేళ ఆ ఇద్దరు ఇక్కడకు ఎలా వచ్చారో అన్న అనుమానాలు బయలుదేరాయి. దీంతో ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో బెంగళూరుకు చెందిన ప్రణవ్, చెన్నైకు చెందిన సునీల్‌కుమార్‌లుగా తేలింది. ఓ కేసు విషయంగా ఓ వ్యక్తి సాయం కోసం వచ్చామని, వాళ్లే తమను ఇక్కడ ఉండమని చెప్పినట్టు ఆ ఇద్దరూ పేర్కొన్నారు. అసలు ఆ కేసు ఏమిటీ, ఆ వ్యక్తులు ఎవరో అన్న కోణంలో విచారణను క్యూబ్రాంచ్‌ వర్గాలు వేగవంతం చేశాయి.  

మరిన్ని వార్తలు