కందుకూరులో దొంగల బీభత్సం

4 Jun, 2019 08:40 IST|Sakshi
చోరీ జరిగింది ఈ ఇంట్లోనే..

కందుకూరు: కందుకూరు మండల పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చొరబడి సుమారుగా రూ.8.70 లక్షల విలువ గల బంగారు, వెండి, నగదు దోచుకెళ్లారు. ఎస్‌ఐ స్వామి కథనం మేరకు వివరాలు.. కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్లకు చెందిన మేదరి నర్సింహ కుటుంబం ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి చెర్వుగట్టుకు దైవ దర్శనానికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచి పెట్టిన నాలుగున్నర తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు, రూ.5.90 లక్షల నగదు దోచుకున్నారు. పక్కనే ఉన్న తల్లోజు నిర్మలమ్మ, మోటే సత్తమ్మ ఇళ్లకు తాళం వేసి ఇంటిపై నిద్రిస్తున్నారు. దీంతో ఆ రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు.

తల్లోజు నిర్మలమ్మ ఇంట్లో బీరువాలో దాచిన 26 తులాల వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు, మోటే సత్తమ్మ ఇంట్లో 27 గ్రాముల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదు దోచుకుని పరారయ్యారు. ఈ మూడు ఇళ్లు ఊరికి చివరన ఉన్నాయి. సోమవారం ఉదయం దొంగలు పడినట్లుగా గుర్తించిన బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ జంగయ్య, ఎస్‌ఐ.స్వామి సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ జంగయ్య, ఎస్‌ఐ స్వామి మాట్లాడుతూ...తాళం వేసి ఊరు వెళ్తుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తాళం వేసి ఇంటిపైన అందరూ నిద్రించకుండా ఒకరన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం జరిగిన చోరీలు కేవలం తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేశారన్నారు.

మరిన్ని వార్తలు