బస్సును ఢీకొన్న కారు: ముగ్గురి దుర్మరణం

9 Nov, 2018 10:18 IST|Sakshi
బస్సు వెనుకవైపు అతివేగంగా ఢీకొన్న కారు సురక్షితంగా బయటపడిన లక్షణ్‌

మంత్రి జయకుమార్‌ సహాయకుడు, ఆయన ఇద్దరు కుమారులు మృతి

తీవ్రంగా గాయపడ్డ కోడలు

సురక్షితంగా బయటపడిన మూడేళ్ల చిన్నారి

తమిళనాడు ,సేలం: బస్సును కారు ఢీకొన్న ఘటనలో రాష్ట్ర మంత్రి జయకుమార్‌ ప్రత్యేక సహాయకుడు సహా ఆయన ఇద్దరు కుమారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కరూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కరూర్‌ జిల్లా రాయనూర్‌ ప్రాంతానికి చెందిన లోకనాథన్‌ (60). ఈయన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ వద్ద అదనపు ప్రత్యేక సహాయకుడిగా పనిచేస్తున్నారు. ఈయన చెన్నైలోని సెంగుండ్రంలో కుటుంబంతో నివసిస్తున్నారు. ఈయన సొంత ఊరు కరూర్‌ జిల్లా రాయనూర్‌. లోకనాథన్‌ దీపావళి పండుగ సందర్భంగా ఆయన తన పెద్ద కుమారుడు శివరామన్‌ (29), కోడలు షాలిని(28), మనవడు లక్షన్‌ (3), చిన్న కుమారుడు నిర్మల్‌కుమార్‌ (26)తో కలిసి కారులో వెళ్లారు. అక్కడ దీపావళి పండుగ జరుపుకుని తిరిగి కారులో బుధవారం వేకువజామున అందరూ చెన్నైకి బయలుదేరారు.

బుధవారం ఉదయం కడలూరు జిల్లా, వేప్పూర్‌ సమీపంలోని కూత్తక్కుడి రైల్వే వంతెన సమీపంలో తిరుచ్చి – చెన్నై జాతీయ రహదారిలో వెళుతుండగా, ముందు వెళుతున్న ప్రభుత్వ బస్సు హఠాత్తుగా కుడివైపునకు తిరిగింది. దీంతో కారు అదుపుతప్పి బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో కారులో ఉన్న లోకనాథన్‌ ఆయన కుమారులు శివరామన్, నిర్మల్‌ కుమార్‌ సంఘటనా స్థలంలోనే దుర్మణం చెందారు. షాలిని తీవ్రంగా గాయపడగా, లక్షన్‌ అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు షాలినిని రక్షించి హుటాహుటిన ఉలుందూరు పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ముగ్గురి మృతదేహాలను శవపంచనామా నిమిత్తం వృద్ధాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు