గంగమ్మ జాతరలో విషాదం

22 Aug, 2018 07:03 IST|Sakshi
బాల గురప్ప మృతదేహం వద్ద విలపిస్తున్న తండ్రి

రామ భద్రునిపల్లె చెరువు వద్ద గంగమ్మ జాతర నిర్వహిస్తున్న బెస్తకులస్తుల్లో అనుకోని విషాదం నెలకొంది. అప్పటి వరకూ తమతో ఉన్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. జాతర పనుల్లో భాగంగా విస్తర్లు తీసుకురావడానికి వెళ్లిన బావబామ్మర్దిని ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించడంతో పాటు మరొకరిని తీవ్రంగా గాయపరచడంతో కుటుంబ సభ్యులు విలవిల్లాడారు. సంజామల మండలంలోని రామభద్రునిపల్లె–పేరుసోముల గ్రామాల మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  

సంజామల (కర్నూలు): మండల పరిధిలోని గిద్దలూరు గ్రామానికి చెందిన 200 మంది బెస్త కులస్తులు గంగమ్మ జాతర నిర్వహించేందుకు మంగళవారం రామ భద్రునిపల్లె చెరువు వద్దకు చేరుకున్నారు. వర్షాలు కురవాలని, చెరువుకు నీరు రావాలని ఉదయం నుంచే పూజలు చేశారు. చెరువు కట్ట మీద ఉన్న గంగమ్మకు మొక్కులు చెల్లించి అందరూ భోజన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతరకు అనుకున్న వారికంటే ఎక్కువ రావడంతో భోజనానికి విస్తర్లు తక్కువ అవుతాయనే ఉద్దేశంతో యువకులు రవి, బాలగురప్ప, మనోహర్‌ బైక్‌పై పేరుసోములకు బయలుదేరి వెళ్లారు.

వస్తువులు తీసుకొని తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌ ఢీకొంది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన బాలగురప్ప(24) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన రవి, మనోహర్‌లను చికిత్స నిమిత్తం 108లో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాలకు తరలిస్తుండగా మనోహర్‌(26) మార్గమధ్యంలో మృతి చెందాడు. రవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో గిద్దలూరులోనూ, శుభకార్యంలో పాల్గొన్న బంధువుల్లోనూ విషాదం నెలకొంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌ చెప్పారు.
 
ప్రాణాలు కాపాడని హెల్మెట్‌ 
శుభ కార్యానికి విస్తర్ల కోసం బైక్‌పై రవి, మనోహర్‌లతో కలిసి వెళ్తున్న బాలగురప్ప హెల్మట్‌ «ధరించాడు. తలకు హెల్మెట్‌ ధరించినా ప్రాణాలను కాపాడలేకపోయింది. ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టడంతో ముగ్గురూ రోడ్డు పక్కన తగ్గున ఉన్న పొలాల్లో ఎగిరి పడ్డారు. తలకు బలంగా తగలడంతో హెల్మెట్‌ పగిలిపోయింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

శుభ కార్యం కోసం ఆగి.. 
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన మనోహర్‌ గిద్దలూరు గ్రామానికి చెందిన ప్రశాంతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి లత, లతిక కవల పిల్లలు. ప్రస్తుతం ప్రశాంతి నాలుగు నెలల గర్భిణి. పండగకు పుట్టింటికి వచ్చింది. మనోహర్‌ కూడా నాగుల చవితి పండుకు గిద్దలూరులో ఉన్న భార్య వద్దకు వచ్చాడు. పండుగ అనంతరం స్వగ్రామానికి వెళ్లాలనుకోగా నాలుగు రోజుల్లో గంగమ్మ జాతర జరుగుతుందని, ఉండాలని చెప్పడంతో ఆగిపోయాడు. గంగమ్మ వేడుకల్లో పాల్గొన్న వారికి విస్తర్లు తీసుకువస్తుండగా మృత్యువు కబలించింది.

మరిన్ని వార్తలు