నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా

14 Jun, 2018 12:10 IST|Sakshi
 తరలించేందుకు సిద్ధంగా ఉన్న వెదురు

నిద్రపోతున్న అటవీశాఖ సిబ్బంది

శృంగవరపుకోట రూరల్‌ : మండలంలోని బొడ్డవర పంచాయతీ శివారు గాదెల్లోవ గిరిజన ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా జరుగుతోంది. గాదెల్లోవ ప్రాంతం నుంచి వెదురు మోపులు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన విషయమై బుధవారం ఉదయం విలేకరులకు సమాచారం అందింది.

దీంతో విలేకరులు ఆ ప్రాంతానికి వెళ్లే సరికి భారీ సంఖ్యలో వెదురు మోపులు రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వెదురు మోపులు ఉంచిన స్థలంలోను, చుట్టు పక్కల మనుషుల జాడ మాత్రం లేదు. వెదురు మోపుల రవాణా విషయమై బొడ్డవర వద్ద పలువురిని ప్రశ్నించగా ఎప్పటికప్పుడు గాదెల్లోవ, దబ్బగుంట, తదితర ప్రాంతాల నుంచి వెదురుతో పాటు ఇతర కలప కూడా పెద్ద ఎత్తున రవాణా జరుగుతోందని స్పష్టం చేశారు.

అలాగే కాశీపట్నం, తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి బొగ్గు మూటలు కూడా క్రమం తప్పకుండా సైకిళ్లపై అక్రమంగా తరలుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అటవీశాఖ సిబ్బంది, అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ  పలువురు విమర్శిస్తున్నారు.

వెదురు మోపుల అక్రమ రవాణా విషయమై విజయనగరం రేంజ్‌ అటవీశాఖ గార్డు బ్రహ్మాజీ వద్ద ప్రస్తావించగా, గాదెల్లోవ ప్రాంతం విశాఖ జిల్లా అనంతగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల నుంచి జరుగుతున్న వెదురు, కలప, బొగ్గుల రవాణాపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు