కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు

14 Jun, 2018 12:09 IST|Sakshi

పరిశ్రమ సాధించే వరకూ పోరాటం ఆగదు : అవినాష్‌ రెడ్డి

సాక్షి, కడప : ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో జిల్లాలో ఉక్కుపోరాటం ఉదృతమౌతోంది. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. పరిశ్రమ సాధంచే వరకూ వెనకడుగు వేసేది లేదంటూ ముందుకు కదులుతున్నాయి. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కడపలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా రాజ్యాంగ సృష్టి కర్తకు పూలమాలలు వేసి, విగ్రహం ముందు బైఠాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, కడప, పార్లమెంట్‌ అధ్యక్షులు సురేస్‌ బాబు,  రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

రాజంపేటలో వామపక్షాల ఆందోళన : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేస్తూ రాజంపేటలో వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చెవిలో పూలు పెట్టుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. రాష్టానికి అన్యాయం చేసిన బీజేపీని తరిమి కొట్టాలని నినదించారు.

మరిన్ని వార్తలు