గువ్వల చెరువు ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం

2 Nov, 2018 13:20 IST|Sakshi
బస్సు, రక్షణ గోడల మధ్య ఇరుక్కున్న కారు

ఆర్టీసీ అద్దె బస్సును ఢీకొన్న లారీ

అదుపుతప్పి బోల్తా పడ్డ బస్సు

15 మందికి గాయాలు వెంటనే స్పందించిన పోలీసులు

క్షతగాత్రులు  రిమ్స్‌కు తరలింపు

వైఎస్‌ఆర్‌ జిల్లా, చింతకొమ్మదిన్నె/కోటిరెడ్డిసర్కిల్‌ : ఉదయాన్నే వివిధ పనుల మీద కడప నగరానికి ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. రాయచోటిలో ఏడు గంటలకు ఏపీ04 టీయూ 8316 నెంబరుగల ఆర్టీసీ హయ్యర్‌ నాన్‌స్టాప్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో కదిలింది. ఈ బస్సు గువ్వలచెరువు ఘాట్‌ మీదుగా మరో అర గంటలో కడప నగరానికి చేరుకోవాల్సి ఉండింది. ఘాట్‌లోని చివరి మలుపు వద్ద ఆంజనేయస్వామి గుడి సమీపంలో మలుపు తిరుగుతుండగా వెనుకవైపు నుంచి లోడుతో వస్తున్న తమిళనాడుకు చెందిన టీఎన్‌03 ఏఎల్‌ 8362 నెంబరు గల లారీ బ్రేకులు పనిచేయక ముందు వెళుతున్న బస్సును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురై బోల్తాపడింది.  లారీ డ్రైవర్‌ ఆందోళనకు గురై లారీ నుంచి దూకడంతో లారీ బస్సును ఈడ్చుకుంటూ వెళ్లింది. బస్సు ఒక్క ఉదుటున రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ రక్షణ గోడ వైపు వెళ్లింది.

బస్సు బోల్తాపడిన సమయంలో బస్సులోని ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వెంటనే రాయచోటి నుంచి కడపకు వస్తున్న వాహనదారులు, కడప నుంచి రాయచోటికి వెళుతున్న ప్రయాణికులు వారి  వాహనాలు నిలిపివేసి సహాయక చర్యలకు పూనుకున్నారు. అయితే బస్సు లోయలో పడకుండా రక్షణగా ఏర్పాటు చేసిన గోడను ఆనుకుని ఉన్న గ్రిల్స్‌ అడ్డుకట్ట వేయడంతో ప్రయాణికులకు గండం తప్పింది. బస్సు గనుక లోయలోపడి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అక్కడున్న వాహనదారులు తెలిపారు. బస్సు బోల్తా పడిన సంఘటనలో 15 మందికి  గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చింతకొమ్మదిన్నె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 వాహనాన్ని పిలిపించి గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న ఎపి 26 ఎల్‌ 9779 నంబరు గల కారు బస్సుకు, రక్షణ గోడలకు మధ్య ఇరుక్కుపోయింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. బస్సు కారుపై పడి ఉంటే పెద్ద ప్రాణ నష్టం సంభవించేది.

రిమ్స్‌లో వైద్య సేవలు
బస్సు ప్రమాదంలో  విశాలిని, జ్యోతి, శ్రీనివాసులు, సాంబశివారెడ్డి, చెట్టిబాబు, భాస్కర్‌నాయక్, అన్నయ్య, వెంకటదాసు, లారీ డ్రైవర్‌ సెల్వ కుమార్‌లకు బలమైన గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో తరలించి రిమ్స్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గిరిధర్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ వెంకటశివ ఆధ్వర్యంలోని వైద్య బృందం బాధితులకు వైద్య చికిత్సలు అందించారు. వీరిలో లారీ డ్రైవర్‌ సెల్వకుమార్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించినట్లు డాక్టర్‌ గిరిధర్‌ తెలిపారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆర్టీసీ ఆర్‌ఎం విజయరత్నం, సీఐ కన్యాకుమారి, టీఐ–3 శోభాదేవి, కంట్రోలర్‌ బజ్జొప్పలు పరామర్శించారు.

కేసు నమోదు
ఈ ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కడప రూరల్‌ సీఐ నాయకుల నారాయణ, సీకే దిన్నె ఎస్‌ఐ హేమకుమార్,  హైవే పెట్రోలింగ్‌ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించడంలో తమవంతు సహకారాన్ని అందించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒక్కసారిగాబస్సు కుదుపునకు గురైంది
నా పేరు నరసింహులు. బళ్లారి వెళ్లేందుకు రాయచోటిలో  బస్సు ఎక్కాను. ఘాట్‌లోని అన్ని మలుపులను దాటుకున్నాం. చివరి మలుపులో వెనుకవైపు నుంచి లారీ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే బస్సు పల్టీలు కొట్టింది. బస్సులో ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. అస్సలు బతుకుతాం అనుకోలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం.
– నరసింహులు, శిబ్యాల గ్రామస్తుడు, ప్రత్యక్ష సాక్షి

మరిన్ని వార్తలు