రౌడీషీటర్‌ హత్య కేసులో 12 మంది అరెస్టు

11 Jul, 2019 08:35 IST|Sakshi
ఉమా యాదవ్‌ హత్య కేసులో అరెస్టు అయిన నిందితులు

ఆధిపత్య పోరుతోనే ఉమాయాదవ్‌ హత్య 

నిందితులంతా టీడీపీ నేతలే

సాక్షి, మంగళగిరి: రౌడీషీటర్‌ తాడిబోయిన ఉమాయాదవ్‌  హత్యకేసులో 12 మంది నిందితులను  సీఐ నరేష్‌కుమార్‌ అరెస్టు చేసి బుధవారం  రిమాండ్‌కు తరలించారు. మృతుడు తాడిబోయిన ఉమాయాదవ్‌కు స్థానికంగా నివసించే తోట శ్రీనివాసరావు ఆధిపత్యపోరు నడుస్తుంది. ఇందులో భాగంగా తోట శ్రీనివాసరావు ప్రణాళికా ప్రకారం గత నెల 25వ తేదీన శ్రీనివాసరావు ఇంటి దగ్గర కాపు కాసి అదే దారిలో ఇంటికి వెళ్తున్న తాడిబోయిన ఉమాయాదవ్‌పై కత్తులతో దాడిచేసి హత్య చేశారు.

హత్యలో పాల్గొన్న వారికి టీడీపీ నాయకులు  ఏనుగ కిషోర్, చావలి మురళీకృష్ణ, నల్లగోర్ల శ్రీనివాసరావులు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో అరెస్టై కోర్టు రిమాండ్‌ విధించిన వారిలో తోట శ్రీనివాసరావు, తోట పానకాలు, రుద్రు గోపి, తోట సాంబశివరావు, తోట శ్రీకాంత్, చింతా శివప్రసాద్, ఏనుగ కిషోర్, కుర్రా సాంబశివరావు, చావలి మురళీకృష్ణ, తోట సైదులు, షేక్‌ వజీర్‌సుల్తాన్, నల్లగొర్ల శ్రీనివాసరావులున్నారు.

చంద్రబాబు పర్యటన వాయిదా..
ఉమాయాదవ్‌ను హత్య చేసిన వారందరూ టీడీపీకి చెందిన వారని తెలియడంతో 8వ తేదీన మంగళగిరి పర్యటనను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేశారు. టీడీపీ నేత తాడిబోయిన ఉమాయాదవ్‌ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చూశారు. అయితే హత్యలో కీలక సూత్ర ధారులు అందరూ టీడీపీవారే కావడంతో  ఊహించని రీతిలో చంద్రబాబు పర్యటన వాయిదా వేశారు. హత్య కేసులో కొంత మంది నిందితులను పోలీసులు ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే అదుపులోకి తీసుకుని సీసీఎస్‌లో విచారించారు.  

అయితే సీసీఎస్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న  ఓ వ్యక్తి నిందితులకు సెల్‌ఫోన్‌ ఇచ్చి వారు ప్రధాన నిందితులతో మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ప్రధాన నిందితులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఏఎస్సై నిందితులకు సహకరించడం వల్లే హత్యకేసులోని కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు  ఎక్కువ సమయం పట్టిందని తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో జరిగిన కేసులో ఏఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించి నిందితులకు సహకరించడాన్ని ఎస్పీ  పీ.హెచ్‌.డీ.రామకృష్ణ సీరియస్‌గా తీసుకున్నట్లు పోలీసు వర్గాలు చర్చించకుంటున్నాయి. సీసీఎస్‌కు వచ్చే  ప్రతి కేసులో  ఇతను నిందితులకు  ఏదో విధంగా సహకరించి లబ్ధి పొందుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  కేసుకు సంబంధం లేనివారిని కూడా తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు దండుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్న ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు