మ‘రుణ’ మృదంగం!

14 Dec, 2019 10:07 IST|Sakshi
ఉత్తిరపతి, సంగీత, అభినయశ్రీ, కుమారుడు ఆకాష్‌ (ఫైల్‌). ఇంటి వద్ద గుమికూడిన జనం

రెండు కుటుంబాలనుమింగేసిన అప్పులు

తొమ్మిది మంది మృతి

విల్లుపురం, దిండుగల్లులో విషాదచాయలు

నేర్చుకున్న వృత్తిని నమ్ముకోక స్నేహితుల మాటలు నమ్మిఓ కుటుంబ పెద్ద పెడదారిన పట్టడం భార్యాపిల్లలకుశాపమైంది. దంపతులతోపాటు ముగ్గురు చిన్నారుల ప్రాణాలను హరించివేసింది. అలాగే చేసిన అప్పులు మెడకు చుట్టుకోవడంతో తీర్చేమార్గం లేక భార్య, ఇద్దరు పిల్లలు సహా రైలు పట్టాలపై జీవితాన్ని చాలించాడు. దాదాపుగా ఒకేరోజు జరిగిన ఈ సంఘటనలు స్థానిక ప్రజలనుకలచివేశాయి.  

సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం జిల్లా సెంజి సమీపం పనమలై గ్రామానికి చెందిన  బంగారు నగల తయారీ కార్మికుడు అరుళ్‌ (32), భార్య శివగామసుందరి (28), కుమార్తెలు ప్రియ దర్శిని (5), యువశ్రీ (3) భారతి (1)లతో కలిసి విల్లుపురం సిత్తేరీకరైలో అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నాడు. తొలిరోజుల్లో సొంతగా నగలతయారీ దుకాణాన్ని పెట్టుకుని జీవనం సాగించేవాడు. అయితే ఈ వృత్తిలో అత్యాధునిక యంత్రాల ప్రవేశంతో తన దుకాణాన్ని శాశ్వతంగా మూసివేసి వేరే నగల తయారీ కంపెనీలో కార్మికునిగా చేరాడు. అయితే ఆశించిన ఆదాయం లభించక విరక్తి చెందాడు.   పరిమితమైన ఆదాయం కలిగిన జీవితంలో రాజీపడలేక పక్కదారులు వెతికాడు. ఈ దశలో కొందరు స్నేహితులు లాటరీల ద్వారా జాక్‌పాట్‌ కొడితే భారీ ఆదాయం ఖాయమని ఆశపెట్టారు. వారి సలహాతో మూడు నంంబర్ల లాటరీ చీటీలను కొనడం ప్రారంభించాడు. ఇదిగో వస్తుంది, అదిగో లాటరీ తగులుతుందనే ఆశతో గత నాలుగేళ్ల కాలంలో సంపాదించిన సొమ్ముంతా లాటరీలో పెట్టేశాడు. దీంతో కుటుంబ పోషణ కష్టమైపోయి కృంగిపోయాడు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 11 గంటలకు తన భార్యా బిడ్డలకు విషమిచ్చి తాను సేవిస్తున్న వీడియోను వాట్సాప్‌లో పెట్టి స్నేహితులకు పంపాడు. ఈ వీడియో విల్లుపురం నగరమంతా వైరల్‌ కావడంతో అందరూ వారికోసం వెతుకులాట ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరుళ్‌ ఇంటిని కనుగొన్నారు. ఇంటి ముందువైపు తలుపులు మూసి ఉండడంతో పగులగొట్టి లోనికి ప్రవేశించి చూడగా ఐదుగురూ స్పృహతప్పిన స్థితిలో పడిఉన్నారు. పోలీసులు వచ్చి అందరినీ ఆసుపత్రికి తరలించగా అందరూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

అరుళ్, శివకామసుందరి, ప్రియదర్శిని, యువశ్రీ, భారతిల మృతదేహాలు (ఇన్‌సెట్‌లో భార్య, పిల్లలతో అరుళ్‌)
కంటతడిపెట్టించిన వీడియో..
నగల తయారీకి వినియోగించే సైనైడ్‌ను పాలలో కలిపి ముందుగా పిల్లలతో తాగించాడు. ఆ తరువాత భార్యకు ఇచ్చి అందరూ ప్రాణాలు విడిచిన తరువాత అరుళ్‌ తానూ సేవించి ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వాట్సాప్‌లో విడుదల చేసిన ఒక వీడియోలో పిల్లలకు సైనైడ్‌ను కలిపిన పాలను తాగించడం, పిల్లలంతా చనిపోయిన దృశ్యాలను అందరూ చూడండి అంటూ అరుళ్‌ చెపుతున్నాడు. ప్రాణాలు విడిచే సమయంలో పిల్లలంతా గిలగిలా కొట్టుకునే దృశ్యాలు అందరినీ కలచివేశాయి. మరో వీడియోలో...దేవుళ్లారా మీ వల్ల అనేక గుణపాఠాలు నేర్చుకున్నాను, మనుషుల్లో న్యాయం, ధర్మం నశించాయి, నా భార్యా, పిల్లలను విషంతో చంపి కూర్చుని ఉన్నాను. నేను కూడా విషం తీసుకోబోతున్నా. ఆ తరువాత అందరూ జాలీగా జీవించండి. విల్లుపురంలో మూడునంబర్ల లాటరీ లేకుండా నిర్మూలించండి. ఇలా మరో కుటుంబం బలికాకూడదు...అంటూ ఆవేదనతో చెబుతున్న దృశ్యాలు పోలీసులను సైతం కంటతడిపెట్టించాయి.

మరో కుటుంబ విషాదగాథ: అప్పుల బాధ అతడిని ఆత్మహత్యకు పురికొల్పింది. అంతేగాక తనతోపాటూ భార్యా పిల్లలను సైతం బలవన్మరణానికి పాల్పడేలా చేశాడు. తిరుచ్చిరాపల్లి ఉరలయూరుకు చెందినఉత్తిరపతి (50) తన భార్య సంగీత (43), కుమార్తె అభినయశ్రీ (15), కుమారుడు ఆకాష్‌ (12)లతో కలిసి కొన్నిరోజుల క్రితం  దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్‌కు వచ్చి విహారయాత్ర చేశారు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో వారంతా కొడైరోడ్డు రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఒకరిచేతిని ఒకరు పట్టుకుని రైలుపట్టాలపై నడుచుకుంటూ బయలుదేరారు. ఈ సమయంలో తిరునెల్వేలీ–చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు వారిని ఢీకొనడంతో అందరి శరీరాలు చిద్రమై సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుల ఆధార్‌కార్డు ఆధారంగా మృతుల వివరాలు తెలుసుని బంధువులకు సమాచారం ఇచ్చారు.  అప్పుల బాధతోనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాధమిక విచారణలో పోలీసులు తేల్చారు. ఆత్మహత్యకు పాల్పడాలనే ఉద్దేశ్యంతోనే వారు కొడైక్కెనాల్‌కు బయల్దేరారని చెప్పారు. రాష్ట్రంలో ఒకేరోజున రెండు కుటుంబాలు నిలువునా ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు