నడిరోడ్డుపై అల్లుడి దారుణహత్య

26 Jun, 2018 13:56 IST|Sakshi
హత్యకు గురైన రాజశేఖర్‌ రాజశేఖర్‌ (ఫైల్‌)

చిట్టేడులో ఘటన

కోట: ప్రేమ వివాహం పగను రాజేసింది. కన్నబిడ్డను దూరం చేశాడని కక్ష పెంచుకున్న మామ చివరకు అల్లుడిని కడతేర్చి ఘటన సోమవారం చిట్టేడులో జరిగింది. వాకాడు సీఐ ఉప్పాల సత్యనారాయణ  సమాచారం మేరకు.. చిట్టేడులో ఒకే వీధిలో నివాసం ఉంటున్న బలిజ సామాజిక వర్గానికి చెందిన కొమ్మ రాజశేఖర్‌ (27) ముదిరాజ్‌ సామాజిక వర్గానికి యువతి నిరోషా ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని నాయుడుపేటలో కాపురం ఉంటున్నారు. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి రామయ్య పలుమార్లు ఆవేశంగా రాజశేఖర్‌ కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ మాట్లాడినట్లు సమాచారం. సోమవారం స్నేహితుడు మృతి చెందడంతో చిట్టేడుకు వచ్చిన రాజశేఖర్‌ తన తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్లాలని మరో స్నేహితుడి వాహనం తీసుకుని ఇంటి వద్దకు వచ్చాడు.

రాజశేఖర్‌ వచ్చిన విషయం తెలుసుకున్న మామ రామయ్య కత్తి తీసుకుని కాపుగాశాడు. ఇంటి వద్ద బైక్‌ దిగిన వెంటనే రాజశేఖర్‌ను కత్తితో నరికినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని పసిగట్టిన రాజశేఖర్‌ వీధిలో పరుగెత్తేందుకు ప్రయత్నించగా మరోమారు మెడపై నరకడంతో కుప్పకూలాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజశేఖర్‌ను స్థానికులు కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు తెలియడంతో మృతదేహాన్ని ఇంటికి తెచ్చారు. ఇంటి ముందే బిడ్డ దారుణ హత్యకు గురవడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు కన్నీరు.. మున్నీరుగా రోదించారు. దారుణ ఘటన గ్రామస్తులను భయభ్రాతులకు గురి చేసింది. నిందితుడు అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. గూడూరు డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్నీ కోణాల్లో విచారణ జరుపుతామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాలిరెడ్డిపాళెంకు తరలించారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా