ఓఎల్‌ఎక్స్‌ పేరుతో ఆగని మోసాలు

11 Nov, 2019 11:37 IST|Sakshi

రూ.వేలల్లో నగదు బదిలీ.. ఆపై ఫోన్లు స్విచ్చాఫ్‌   

నాలుగేళ్లలో నగరంలో 165 చీటింగ్‌ కేసులు నమోదు   

సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తున్నా మేలుకోని వైనం

ఆన్‌లైన్‌ మోసాలకు అంతే ఉండటంలేదు. కారుచౌక బేరమని ప్రకటనలు గుప్పిస్తూ అమాయకులను మాటలతో బురిడీ కొట్టిస్తూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌ వంటి వెబ్‌సైట్లలో టూవీలర్స్, ఫోర్‌వీలర్స్‌ తదితరాలను తక్కువ ధరలకు సెకండ్‌ సేల్‌ అని ప్రకటనలు గుప్పిస్తూ ఆకర్షిస్తారు. అందులోని నంబరును సంప్రదిస్తే మాటలతో మాయచేసి ఆన్‌లైన్‌ ద్వారా నగదు అందుకుని మాయమవుతున్నారు.  

సాక్షి, అమరావతి : ‘మారుతీ స్విఫ్ట్‌.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌.. తక్కువ ధరలకే ఇస్తున్నాం..’ అంటూ ఓఎల్‌ఎక్స్‌ పేరిట వెబ్‌సైట్‌లో వచ్చిన ప్రకటనలను నమ్మి మోసపోతున్న ఘటనలకు అడ్డుకట్ట పడటంలేదు. ఓఎల్‌Šఎక్స్‌ పేరిట వస్తున్న ప్రకటనల్లో 90 శాతం తప్పుడువని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు మోసగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. అమాయకులు నష్టపోతూనే ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని మిలటరీ కార్యాలయాల్లో పనిచేస్తున్నామని నేరస్తులు తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. మోసపోతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏడాదికి సగటున ఎనిమిది మంది బాధితులు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.    

హైదరాబాద్‌  రిజిస్ట్రేషన్‌ నంబర్లే.. 
రాజస్థాన్, హరియాణ రాష్ట్రాలకు చెందిన సైబర్‌ నేరస్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించిన   బైక్‌లు, కార్ల ఫొటోలను ప్రకటనల్లో ఇస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయాల్లో రిజిస్టరైన కార్లు, బైకుల ఫొటోలు సేకరిస్తారు. అసలు ధరలో 50 నుంచి 60 శాతానికే ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు బయానా పుచ్చుకున్నాక వాహనాన్ని పంపుతున్నామని, మిగిలిన డబ్బులు పంపించేయాలని సూచిస్తున్నారు. కార్లు కొనుగోలు చేసిన వారికి గన్నవరం విమాశ్రయం పార్కింగ్‌లో వాహనం ఉందని.. వెళ్లి తీసుకోండని సూచిస్తున్నారు. తక్కువ ధరలకే కార్లు వస్తున్నాయన్న ఆశతో కొందరు సైబర్‌ నేరస్తులు సూచించిన ఖాతాల్లో నగదు బదిలీ చేసి మోసపోతున్నారు.  

‘కారు’మేఘం 
భవానీపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌ ఈ నెల 3వ తేదీన వెబ్‌సైట్‌లో ఐ10 కారు విక్రయ ప్రకటన చూశారు. ప్రకటనలో ఉన్న నంబరుకు ఫోన్‌ చేయగా.. తనను తాను మిలటరీ రిటైర్డ్‌ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. రూ.80 వేలకు కారు ఇస్తానని అవతలి వ్యక్తి చెప్పాడు. మిలటరీ కొరియర్‌ ద్వారా కారును విజయవాడ విమానాశ్రయానికి పంపుతానన్నాడు. ముందస్తుగా కొరియర్‌ చార్జీల కింద రూ.16,150 పంపించాలని సూచించాడు. అంతా బాగుందనుకున్న ప్రేమ్‌కుమార్‌ నిందితుడి ఖాతాలో నగదు జమ చేశాడు. ఆ నగదు తన ఖాతాలో పడగానే అవతలి వ్యక్తి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. 

‘బుల్లెట్‌’ వేగంతో మాయం 
పెనమలూరు మండలం పోరంకికి చెందిన కరణం సాయికుమార్‌కు బుల్లెట్‌ అంటే ఇష్టం. జనవరి నెలలో వెబ్‌సైట్‌లో ప్రకటన చూసి.. ప్రకటనకర్తను సంప్రదించాడు. రూ.1.79 లక్షలకు బుల్లెట్‌ ఇస్తానని అతను చెప్పాడు. ముందుగా రూ.లక్ష ఇస్తే రిజి్రస్టేషన్‌ చేయిస్తానని నమ్మించాడు. అతని ఖాతాలో సాయికుమార్‌ రూ.లక్ష జమ చేశాడు. బుల్లెట్‌ కోసం ఫోన్‌ చేయగా.. అవతల రింగే కాలేదు. మోసపోయానని తెలుసుకున్న సాయికుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

కారు పంపిస్తున్నానని..  
గూడవల్లిలో నివాసముంటున్న శ్రీనివాసరావు ఏప్రిల్‌ నెలలో ఓఎల్‌ఎక్స్‌లో మారుతీ స్విఫ్ట్‌ కారు అమ్మక ప్రకటనను చూశాడు. రూ.2.75 లక్షలకే కారు విక్రయిస్తానంటూ ఓ వ్యక్తి ప్రకటించడంతో అతని నంబర్‌కు ఫోన్‌ చేశాడు. తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని ఆర్మీ కంటోన్మెట్‌లో ఉద్యోగమని అవతలి వ్యక్తి చెప్పాడు. బయానాగా రూ.27,500 నగదు జమ చేస్తే.. కారు అప్పగిస్తానన్నాడు. అతడి మాటలు నమ్మిన శ్రీనివాసరావు నగదు నిందితుడి ఖాతాలో జమ చేశాడు. గంటలు.. రోజులు గడిచినా అతడు రాలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   

ముందుగా డబ్బు చెల్లించొద్దు    
ఓఎల్‌ఎక్స్‌ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న ప్రకటనలు చూసి మోసపోరాదు. వాహనం చూడకుండా ముందుగా విక్రయదారులకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించవద్దు. మిలటరీలో పనిచేస్తున్నామంటూ ఇటీవల చాలా మంది మోసకారులు తప్పుడు ప్రకటనలు పెడుతున్నారు. వాటిని చూసి మోసపోకండి. వాహనం ప్రత్యక్షంగా చూసి నచ్చాకే.. రికార్డులు పరిశీలించుకుని కొనుగోలుకు ముందుకెళ్లాలి.  
– కె.శివాజీ, సీఐ, సైబర్‌ క్రైం 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు