‘నిర్మలా సీతారామన్‌కి ఇదే ఆఖరి రోజు’

18 Sep, 2018 11:45 IST|Sakshi
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర‍్మలా సీతారామన్‌(ఫైల్‌ ఫోటో)

డెహ్రడూన్‌ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేద్దామంటూ వాట్సాప్‌లో సందేశాలు పంపుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్‌ 66, ఐటీ యాక్ట్‌ కింద వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌ఘర్‌ జిల్లాలో మెగా మెడికల్‌ క్యాంప్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. రక్షణ మంత్రి పర్యటన నేపథ్యంలో కొందరు ఆమెను అంతమొందించాలంటూ ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో సందేశాలు పంపుకుంటున్నట్లు ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం తెలిసింది.

అప్రమత్తమైన పోలీసులు సదరు వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన సందేశాలను పరిశీలించారు. ‘వాటిలో నేను సీతారామన్‌ని కాల్చేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు’ అంటూ ఓ ఇద్దరు వ్యక్తులు పంపుకున్న సందేశాలు ఉన్నాయి. ఈ మెసేజ్‌లు ఆధారంగా పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాగిన మైకంలో వారు ఇలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనప్పటికి దీన్ని మాత్రం చిన్న విషయంగా భావించటం లేదని పోలీసులు తెలిపారు. అందుకే వీరిద్దరికి గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అంతేకాక సదరు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ కోసం కూడా వెదుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు