లంకతో రూపీలో వాణిజ్యం

4 Nov, 2023 05:56 IST|Sakshi

ఎస్‌బీఐకి  మంత్రి సీతారామన్‌ అభినందన

కొలంబో: శ్రీలంక రూపీ–భారత్‌ రూపీ మధ్య వాణిజ్యాన్ని ప్రారంభించినందుకు ఎస్‌బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభినందించారు. శ్రీలంక నుంచి లంకన్‌ రూపీ–భారత్‌ రూపీలో నేరుగా వాణిజ్యం ప్రారంభించిన తొలి విదేశీ బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచినట్టు చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో మంత్రి సీతారామన్‌ పర్యటిస్తుండడం తెలిసిందే. నార్తర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ పీఎస్‌ఎం చార్లెస్‌తో కలసి జాఫ్నా ప్రాంతంలో ఎస్‌బీఐ రెండో శాఖను మంత్రి శుక్రవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖరా, భారత హై కమిషనర్‌ (శ్రీలంక) గోపాల్‌ బాగ్లే కూడా పాల్గొన్నారు. ఎస్‌బీఐ ప్రారంభించిన ఈ నూతన సేవ వల్ల శ్రీలంక దిగుమతిదారులు అమెరికా డాలర్లపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుందని మంత్రి చెప్పారు. ఇది శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు సాయంగా ఉంటుందన్నారు. జాఫ్నా బ్రాంచ్‌ ద్వారా నార్తర్న్‌ ప్రావిన్స్‌లో వ్యాపారాలకు ఎస్‌ బీఐ మద్దతుగా నిలుస్తుందని చెప్పనారు. మంత్రి సీతారామన్‌ గురువారం ట్రింకోమలేలోనూ ఎస్‌బీఐ శాఖను ప్రారంభించడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, ప్రధాని దినేష్‌ గుణవర్ధనేతో మంత్రి సీతారామన్‌ సమావేశమయ్యారు.   

మరిన్ని వార్తలు