‘డేరా బాబాకు యావజ్జీవ ఖైదు’

4 Oct, 2017 16:40 IST|Sakshi

సాక్షి,చండీగర్‌: డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు జీవిత ఖైదు విధించాలని ఆయన అత్యాచార బాధితులు ఇద్దరు బుధవారం పంజాబ్‌ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. రెండు అత్యాచార కేసులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆగస్ట్‌ 28న డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన విషయం విదితమే.అయితే అత్యాచార కేసులో ఆయన శిక్షను యావజ్జీవ ఖైదుకు పొడిగించాలని కోరుతూ బాధితులు రివిజన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారని వారి తరపు న్యాయవాది నవ్‌కిరణ్‌ సింగ్‌ చెప్పారు.

డేరా బాబాను ఆయన అనుచరులు పితాజీగా భావించారని అయితే బాధితులను ఆయన శారీరకంగా, భౌతికంగా తన కస్టడీలోకి తీసుకుని వారి విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు మత, ఆథ్యాత్మిక గురువుగా తన స్ధానాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. అందుకే తాము డేరా బాబాకు 20 ఏళ్లకు బదులు యావజ్జీవ ఖైదు విధించాలని తాము కోరుతున్నామన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుల మేరకు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ ప్రస్తుతం హర్యనాలోని రోహ్తక్‌ జిల్లా సునరియ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

మరిన్ని వార్తలు