బీమా సొమ్ము కాజేసేందుకు..

26 Nov, 2017 11:01 IST|Sakshi

భార్య అరెస్ట్‌

బంజారాహిల్స్‌: బతికున్న భార్యను బీమా డబ్బు కోసం చనిపోయినట్లు ధృవపత్రాలు సృష్టించాడో ప్రబుద్దుడు. ఇన్సూరెన్స్‌ సంస్థ సిబ్బంది పత్రాలను విచారించే క్రమంలో అసలు విషయం బయటపడింది. బంజారాహిల్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు ఇన్సూరెన్స్‌ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు శనివారం నిందితురాలు నాజియా షకిల్‌ ఆలంను(37)ను అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ భరత్‌ భూషణ్‌ తెలిపిన మేరకు.. యాకు త్‌పుర, డబీర్‌పురకు చెందిన సయ్యద్‌ షకిల్‌ ఆలం, నాజియాషకిల్‌ ఆలం బార్యా భర్తలు. చనిపోయిన మరో మహిళ పేరుతో ఉన్న పత్రాలను తీసుకొని ఆ పేర్లపై తన భార్య నాజియా షకీల్‌ ఆలం పేరును జతపరిచి డాక్యు మెంట్లన్నీ పక్కాగా సృష్టించాడు. తన భార్య చనిపోయిం దని ఏకంగా శ్మశాన వాటిక రశీదును కూడా తయారు చేశాడు.

రూ. కోటి బీమా మొత్తాన్ని క్‌లైమ్‌ చేస్తూ ఐసీఐసీఐ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవలనే బీమా సంస్థ సిబ్బంది ఈ పత్రాలను తనిఖీ చేస్తుండగా అనుమానాలు తలెత్తాయి. లోతుగా విచారిస్తే షకిల్‌ఆలం చనిపోలేదని తేలింది. వేరే మహిళ పత్రాలను ఫోర్జరీ చేసి తన భార్య పేరును తగిలించి బీమా మొత్తాన్ని దొంగదారిలో పొందేందుకు ఎత్తుగడ వేసిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ చేసిన దంపతులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. మహిళను అరెస్ట్‌చేశారు. ఆమె భర్త కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు