జనసేన నేతపై చీటింగ్‌ కేసు

5 Sep, 2023 14:20 IST|Sakshi

కోవూరు: జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్‌ తన వద్ద రూ.5 లక్షలు డబ్బు తీసుకొని మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్నాడని ఇందుకూరుపేటలోని పడమటివీధికి చెందిన ఎస్‌కే ఆసిఫ్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం మేరకు తాను వృత్తిపరంగా హైదరాబాద్‌లో ఉంటున్నానని, తనతో కలిసి డిగ్రీ చదివిన గునుకుల కిశోర్‌ నెల్లూరులోని గాం ధీబొమ్మ సెంటర్‌లో లగేజ్‌ ల్యాండ్‌ బ్యాగ్‌ షోరూం నిర్వహిస్తున్నాడని తెలిపారు.

కిశోర్‌ తన షాపులో పార్టనర్‌షిప్‌ ఇస్తానని నమ్మబలికి 2016 మార్చి 9న ఆసిఫ్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.3 లక్షలు, 2018 మార్చి 21న యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి రూ.2 లక్షలు మొత్తం రూ.5 లక్షలు కిశోర్‌ ఖాతాకు జమ చేయించుకున్నట్లు బాధితుడు తెలిపాడు.

కొద్దిరోజుల తరువాత వ్యాపారంలో లాభాలు పంచుతానని మాయమాటలు చెప్పాడని, అనంతరం తన ఫోన్‌ తీయకుండా కంటికి కన్పించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితుడు వాపోయా డు. సోమవారం ఇందుకూరుపేట నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళుతున్న క్రమంలో కిశోర్‌ కన్పించగా తనకు ఇవ్వాల్సిన రూ.5 లక్షల ఇవ్వాలని కోరడంతో తనపైన దాడి చేసి అసభ్యకర పదజాలంతో దూషించాడని తెలిపాడు.

తనను నమ్మించి మోసం చేసిన గునుకుల కిశోర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేకాక కిశోర్‌ తనతోపాటు పలువురిని మోసం చేశాడని ఆసిఫ్‌ ఆరోపించారు. కిశోర్‌ తీరుపై జనసేన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోకపోగా, వ్యక్తి గత విషయమైనందున మీరే తేల్చుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితుడు వాపోయాడు. ఇక గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించినట్లు ఆసిఫ్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు