వివాహేతర సంబంధానికి అడ్డని హత్య

14 Oct, 2017 07:49 IST|Sakshi
హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, వెనుక నిందితులు

భార్య, ప్రియుడు అరెస్ట్‌  

మృతిపై బంధువుల దృష్టి మళ్లించేందుకు భార్య చేసిన ఫిర్యాదుతో కదిలిన డొంక

పశ్చిమగోదావరి , జంగారెడ్డిగూడెం: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్యచేసిన కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత నెల 18న మండలంలోని లక్కవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుట్లగట్లగూడెంలో చేనుబోయిన నాగు (34) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇంటి ఎదురుగా ఉన్న డ్రైన్‌లో పడి ఉండగా గుర్తించిన అతని సోదరుడు అంజియ్య లక్కవరం పోలీసులకు  ఫిర్యాదు చేశారు. లక్కవరం ఎస్సై వి.జగదీశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో వెల్లడైన వివరాలు ఇవి.. నాగు, అతని భార్య శీనమ్మకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన గుర్రం చిట్టియ్యకు, శీనమ్మకు ఏడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శీనమ్మ మూడు నాలుగు సార్లు చిట్టియ్యతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. గ్రామ పెద్దలు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ దంపతుల కాపురాన్ని సరిదిద్దారు. అయినా శీనమ్మ, చిట్టియ్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

ఈ ఏడాది జూలైలో శీనమ్మ కోసం ఆమె ఇంటికి రాత్రి సమయంలో చిట్టియ్య వచ్చాడు. అదే సమయంలో శీనమ్మ భర్త నాగు ఇంటికి రాగా అతడిని చూసిన చిట్టియ్య పారిపోయాడు. ఇరువర్గాలు గొడవ పడి లక్కవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. అప్పటి నుంచి చిట్టియ్య, శీనమ్మలు తమకు అడ్డుగా ఉన్న నాగును తొలగించుకోవాలన్నారు. దీనికోసం పథకం రూపొందించుకున్నారు. గత నెల 17 రాత్రి నాగు మద్యంతాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ విషయం చిట్టియ్యకు శీనమ్మ సమాచారం అందించింది. చిట్టియ్య తన వెంట విద్యుత్‌వైరు తీసుకుని నాగు ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న నాగు చేతికి ఒక వైరు, కాలికి ఒక వైరు చుట్టి కరెంటు షాక్‌తో హత్య చేశారు. నాగు చనిపోయినట్టు నిర్ధారించుకున్న తరువాత అతని ఇంటి ఎదురుగాఉన్న మురుగు కాలువలో పడేశారు. మద్యం మత్తులో నాగు కాలువలో పడి చనిపోయినట్టు ఆ మరునాడు ఉదయం అందరినీ నమ్మించారు. కేసు దర్యాప్తు చేసిన సీఐ కె.బాలరాజు, ఎస్సై వి.జగదీశ్వరారవులు చిట్టియ్య, శీనమ్మ కలిసి నాగును హత్యచేసినట్టు విచారణలో తేల్చారు. వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ చెప్పారు. సీఐ, ఎస్సైలకు రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు.

హత్య కేసు ఛేదించింది ఇలా..
నాగు మరణించిన రెండు రోజుల తరువాత అతని సోదరుడు అంజియ్య, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన శీనమ్మ తమపై అనుమానం రాకుండా ఉండేందుకు స్థానిక ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీని కలిసి తనభర్తను ఎవరో హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ నాగు మృతిని లోతుగా విచారించాలని ఆదేశించారు.  సీఐ కె.బాలరాజు, ఎస్సై వి.జగదీశ్వరరావు రంగంలోకి దిగి నాగు పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించగా విద్యుత్‌షాక్‌కు గురైనట్టు గుర్తించారు. శీనమ్మ, చిట్టియ్య సెల్‌ఫోన్‌ కాల్‌ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు. గ్రామంలో పెద్దలను విచారించగా శీనమ్మ, చిట్టియ్యల మధ్య వివాహేతర సంబంధం తెలిసింది. చిట్టియ్య వ్యవసాయ కూలీ. గ్రామంలో రైతులు పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్‌వైర్లు ఏర్పాటు చేస్తుం టారు.  ఆ విద్యుత్‌ వైర్లు తగిలి పందులు మృతి చెందుతుంటాయి. షాక్‌ గురై మృతిచెందిన పందులపై ఎటువంటి గాయాలు, ఆనవాళ్లూ లేకపోవడం చిట్టియ్య గమనించేవాడు. నాగును హతమార్చేందుకు ఇదే పద్ధతిని ఎంచుకున్నాడు. శీనమ్మ పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన భర్త నాగును ఎవరో హత్యచేసి ఉంటారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం బెడిసి కొట్టి చివరికి దొరికిపోయారు.  

మరిన్ని వార్తలు