బ్లాక్‌ మనీ... నా వాటా ఏది? | Sakshi
Sakshi News home page

నల్ల ధనంలో వాటా కోసం మోదీకి లేఖ

Published Sat, Oct 14 2017 8:18 AM

Kerala Farmer asks Modi for Black Money Share - Sakshi

సాక్షి, తిరువనంతపురం : విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంను వెనక్కి తెప్పించటమనే ప్రధాన అంశం కూడా బీజేపీ మూడేళ్ల క్రితం అధికారం కైవసం చేసుకోవటానికి ఓ కారణమైందన్నది అక్షర సత్యం. అయితే ఆ మిషన్‌లో మోదీ సర్కార్‌ ఇప్పటివరకు ఎంతమేర పురోగతి సాధించిందన్న దానిపై ఎక్కడా స్పష్టత లేదు. ఆ అంశం పక్కన పెడితే కేరళకు చెందిన ఓ రైతు మాత్రం మోదీ హామీని గుర్తును చేస్తూ ఓ లేఖ రాశాడు. నల్ల ధనంలో తన వాటా ఇచ్చేయండంటూ  ప్రధానిని కోరుతున్నాడు. 

కేరళలోని మనంథవాడీకి చెందిన 68 ఏళ్ల కే చాతు అనే రైతు పంట తీవ్రంగా దెబ్బతింది. నష్టపరిహారం కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. దీంతో ఏకంగా ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ రాశాడు. ’అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా మీరు(ప్రధాని మోదీ) ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. పంట గిట్టుబాటు ధరను దారుణంగా తగ్గించి.. నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచారు. సామాన్యుడికి బతకటమే కష్టతరంగా మారిపోయింది. నల్ల ధనం వెనక్కి తీసుకొస్తే ఆ డబ్బును దేశ ప్రజలకు పంచుతానని ఎన్నికల సమయంలో వాగ్ధానం చేశారు. కాబట్టి.. నా వాటా నాకు ఇచ్చేయండి. లేదంటే కనీసం ఓ 5 లక్షలు నా అకౌంట్లో వేయండి అంటూ చాతూ తన ఫెడరల్‌ బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా లేఖలో తెలియజేశారు. 

కాగా, మాజీ మావోయిస్టు అయిన చాతు గతంలో స్టార్ హీరో మమ్ముట్టిపై కోర్టులో కేసు కూడా వేశాడు. మమ్ముటి ఓ సబ్బు కంపెనీ తరపున యాడ్ చేయగా.. దానిని వాడు తాను తెల్లగా ఆమరలేదంటూ వినియోగదారుల ఫోరంలో 50,000 వేల రూపాయలకు దావా వేశాడు. దీంతో దిగొచ్చిన సదరు కంపెనీ రూ.30 వేలు చాతుకు చెల్లించి క్షమాపణలు తెలియజేసింది.

Advertisement
Advertisement