చిన్నారులే టార్గెట్‌

19 Jul, 2019 10:21 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ నిందితురాలు అనురాధ

బతుకుదెరువు కోసం నేరబాట

16 నెలలుగా నగరంలో నేరాలు

మూడు కమిషనరేట్ల పరిధిలో 25 కేసులు

వలపన్ని పట్టుకున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: తొలిచూపులోనే ప్రేమలో పడి ఆదర్శ వివాహం చేసుకుంది... భర్త మరణించడంతో మరో వ్యక్తికి సన్నిహితంగా మారింది... అతడూ దూరం కావడంతో బతుకుతెరువు కోసం కూలీగా పని చేసింది. అనారోగ్యానికి గురికావడంతో నేరబాట పట్టింది... కేవలం ఒంటరిగా ఉన్న చిన్నారులనే టార్గెట్‌గా చేసుకుని వారి దృష్టి మళ్ళించి చోరీలకు పాల్పడుతున్న ఈ ఘరానా కిలాడీ విగ్నం అనురాధను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈమెపై గడిచిన 16 నెలల్లో మూడు కమిషనరేట్లలోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదైనట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. తూర్పు మండల అదనపు డీసీపీ టి.గోవింద్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీ సుదర్శన్‌లతో కలిసి గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 

ప్రేమ... పెళ్లి... విషాదం...
 కడప జిల్లా ఎర్రముక్కపల్లికి చెందిన అనురాధ పెద్దగా చదువు కోలేదు. కొన్నేళ్ల క్రితం రైలులో ప్రయాణిస్తుండగా గుంటూరు, రైల్‌పేటకు చెందిన సయ్యద్‌ ఆరిఫ్‌తో పరిచయం ఏర్పడింది. తొలి చూపులోనే అతడితో ప్రేమలో పడింది. పెద్దలను ఎదిరించి ఆదర్శ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి గుంటూరులోనే ఉంటున్న వీరికి ఓ పాప. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... వివాహమైన కొన్నాళ్లకే భర్త కిడ్నీ వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి అనురాధ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఓ వ్యక్తితో సహజీవనం చేసినా అతడూ దూరమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కోసం కూలీగా మారింది. ఈ పని చేస్తుండగానే తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పనులు చేయలేని స్థితికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఆమె నేరబాటపట్టి దొంగగా మారింది. 

టికెట్‌ లేకుండా రైలులో వచ్చి...
సాధారణ చోరీలు చేస్తే చిక్కే ప్రమాదం ఉంటుందని చిన్నారులను టార్గెట్‌గా చేసుకునేది. గుంటూరు నుంచి రాత్రి వేళ రైలులో బయలుదేరి తెల్లారేసరికి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. నిత్యం సెకండ్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే అనురాధ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టికెట్‌ తీసుకోలేదు. నగరానికి వచ్చిన వెంటనే ఆటోలో తిరుగుతూ ఇళ్లు, పాఠశాలలు, పార్కుల వద్ద తిరుగుతూ  ఒంటరిగా కనిపించిన 12 ఏళ్లలోపు చిన్నారులను టార్గెట్‌గా చేసుకుంటుంది. వారి వద్దకు వెళ్లి రూ.10 చూపించడం లేదా ఐస్‌క్రీమ్, చాక్లెట్లు ఇప్పిస్తానంటూ ఆకర్షిస్తుంది. అక్కడి నుంచి దాదాపు 2 కిమీ దూరం తీసుకువెళ్లి వారి ఒంటిపై ఉన్న చెవి కమ్మలు, కాళ్ల పట్టాలు తదితరాలు చోరీ చేసి వదిలేస్తుంది. ఇందుకుగాను ఓ చిన్న కట్టర్‌ వినియోగిస్తుంది.

ఆ తల్లిదండ్రులకు ఎంతో నరకం...  
ఇలా తీసుకున్న వస్తువులను కర్మన్‌ఘాట్, నందనవనం ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి విక్రయించేది. అవి తన పిల్లలవని, వైద్య ఖర్చుల కోసం విక్రయిస్తున్నానంటూ చెప్పేది. అలా వచ్చిన డబ్బుతో గుంటూరు వెళ్లి పోయేది. ఈ నేరాల్లో పోయే సొత్తు తక్కువే అయినా కొద్దిసేపు, కొన్ని గంటలు తమ చిన్నారులు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు నరకం చవి చూసేవారు. ఇలా గత ఏడాది మార్చ్‌ 5 నుంచి ఈ నెల 13 వరకు మలక్‌పేట, సైదాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, సరూర్‌నగర్, మీర్‌పేట, ఉప్పల్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌ల్లో 25 నేరాలకు పాల్పడింది. ఆ చిన్నారుల నుం చి 62 గ్రాముల బంగారం, 681 గ్రాముల వెండి ఎత్తుకెళ్లింది. దీంతో ఈమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

సీసీ పుటేజీ ఆధారంగా పట్టివేత
మలక్‌పేట ఠాణా పరిధిలో రెండు నేరాలు చేసిన ఈ కిలేడీని పట్టుకోవడానికి ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు పర్యవేక్షణలో డీఎస్సై ఎన్‌.శివశంకర్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలి నుంచి వివిధ మార్గాల్లో ఉన్న అనేక సీసీ కెమెరాల నుంచి ఫీడ్‌ను సేకరించిన ఈ టీమ్‌ విశ్లేషించింది. ఫలితంగా అనురాధ తన ఒకే ఆటోలో ప్రయాణించదని, సీసీ కెమెరాల్లో రికార్డు అయినా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చిన్న దూరానికీ రెండుమూడు ఆటోలు మారుతుందని గుర్తించారు. అయితే ఆమె ప్రయాణం నందనవనం ప్రాంతంలో ముగుస్తోందనే కీలక ఆధారం సేకరించిన బృందం ఆ ప్రాంతంపై నిఘా ఉంచింది. దాదాపు వారం రోజులకు పైగా కాపు కాసిన అధికారులు బుధవారం సాయంత్రం అక్కడికి వచ్చిన అనురాధను పట్టుకున్నారు. ఈమె నుంచి 57.6 గ్రాముల బంగారం, 681 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు.

మీ చిన్నారులు జాగ్రత్త
చిన్నారులనే టార్గెట్‌గా చేసుకుని వరుస నేరాలకు పాల్పడిన అనురాధను పట్టుకునేందుకు సీసీ కెమెరాలే కీలకంగా మారాయి. ఈమె నేరం చేసే విధానాన్ని అధ్యయనం చేసిన నేపథ్యంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెలుగులోకి వచ్చాయి. తమ పిల్లలు అపరిచితులతో సన్నిహితంగా ఉండకుండా, వారు డబ్బు, తిరుబండారాలు ఎర వేసినా ఆకర్షితులు కాకుండా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవడం అవశ్యం. దీనికోసంప్రతి ఒక్కరు వారి పిల్లలకు అవగాహన కల్పించాలి.– అంజనీకుమార్, నగర కొత్వాల్‌ 

మరిన్ని వార్తలు