విడాకులివ్వాలంటూ వేధిస్తున్నారు

24 May, 2018 12:20 IST|Sakshi
తన బిడ్డ చేతిపై గాయాలను చూపుతున్న సుధ, చేతికి అయిన గాయాన్ని చూపుతున్న మహిళ ,తలకు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కత్తితో దాడి

తనపై కూడా దాడి చేశారంటూ భర్త ఫిర్యాదు

రాయచోటిటౌన్‌ : విడాకులు ఇవ్వాలంటూ కట్టుకున్న భర్త, అత్త, ఆడపడుచుతో కలసి వేధిస్తున్నాడని గుండ్లూరు సుధ అనే మహిళ బుధవారం రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె చెందిన సుధకు పెద్దమండెంకు చెందిన గౌదుగొండ్ల కృష్ణతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. జీవపాధి కోసం రాయచోటి వచ్చేశారు. కృష్ణ బేల్దారి పనికి వెళ్లడంతో పాటు మార్బల్‌ పనికి కూడా వెళ్లేవాడు. ఈ క్రమంలో ఒక్కోసారి వారం రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో ఆమెను అత్త కాంతమ్మ మాటలతో వేధించేది. తన భర్తకు చెప్పినా తన తల్లి తోబుట్టువు మాటలను నమ్మి తననే కొట్టేవాడు. అయితే ఆమెకు శివమౌళిక ( 10) నెలల చిన్నారి పాప పుట్టిన తరువాత ఈ తగాదా మరింత పెద్దదైంది.

దీంతో మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తన పుట్టింటికి వెళ్లిపోతానని తనకు రావాల్సిన ఇంటిలోని సామాన్లు ఇప్పించాలని పోలీసులను కోరింది. ఆమె కోరిక మేరకు సామాన్లు ఇప్పించాలంటూ అత్త, ఆడపడుచుకు నచ్చజెప్పి పంపారు. అప్పటికే రాత్రి కావడంతో ఆమె సమీప బంధువుల ఇంటిలోనే తలదాచుకుంది. తెల్లవారి ఇంటిలో నుంచి బిడ్డతో పాటు బయటకు  రాగా అప్పటికే కాపు కాసిన కృష్ణ తన వద్ద ఉన్న కత్తితో ఒక్క సారిగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె తండ్రిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారి శివమౌళిక చేతికి గాయమైంది. కాగా, తన భార్య బంధువులే తనపై దాడి చేశారంటూ సుధ భర్త కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు