పోయిన ప్రాణాన్ని దాచారు!

19 Dec, 2019 08:27 IST|Sakshi
ఐసీయూ ముందు నిరసన తెలుపుతున్న కుటుంబసభ్యులు (ఇన్‌సెట్‌లో) మృతురాలు తాటిశెట్టి కుసుమ

ఉదయం చనిపోతే రాత్రి చెప్పారు..

డబ్బుల కోసం గోప్యత పాటించిన వైద్యులు

ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయినా.. తమకు సకాలంలో తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాంనగర్‌ కేర్‌ ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె లీలాకుమారి, సోదరుడు ఎన్‌.మోహనరావు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిశెట్టి కుసుమ (65) ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో నివసిస్తున్నారు. ఇటీవల షుగర్, బీపీ హఠాత్తుగా పెరగడంతో కుసుమను కుటుంబ సభ్యులు రాంనగర్‌ కేర్‌ ఆస్పత్రిలో ఈనెల 15న సాయంత్రం 6.30 గంటలకు జాయిన్‌ చేశారు.

అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా సకాలంలో వైద్యం అందుతున్న కారణంగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకూ అందరితో మాట్లాడింది. బుధవారం ఉదయం సమీప బంధువు కుసుమను చూసేందుకు ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి రాగా రోగి నిద్రపోతోందని, ఆమెను కదిలించవద్దంటూ సెక్యూరిటీ సిబ్బంది ఐసీయూలోకి అనుమతించలేదు. అదేవిధంగా రోగి సోదరుడు మోహనరావు హైదరాబాద్‌ నుంచి వచ్చి ఐసీయూలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని సెక్యూరిటీ అడ్డుకున్నారు.

సాయంత్రం 6 గంటలకు బలవంతంగా లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికీ కుసుమ అపస్మారక స్థితిలో ఉంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుసుమ ఉదయమే చనిపోయి ఉంటుందని, ఈ విషయాన్ని రాత్రి 9.30 గంటల వరకూ దాచిపెట్టారని బంధువులు వాపోయారు. డబ్బులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ రోగుల మీద చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ అడ్డుకున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. 

మరిన్ని వార్తలు