సీఎం కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటా

4 Feb, 2018 03:51 IST|Sakshi
లలితను కిందకు దించుతున్న సీఐ శ్రీధర్‌రెడ్డి

     గుంటూరులో సెల్‌టవర్‌ ఎక్కి టీడీపీ మహిళా కార్యకర్త నిరసన

     తమ పార్టీ నేతల నుంచి ప్రాణభయం ఉందన్న మహిళ

     మంత్రుల పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఆరోపణ

పట్నంబజారు (గుంటూరు): ‘‘నా భర్త శవంతో రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు తప్పు చేసినా చర్యలు చేపడతానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు. నా సమస్యలు పరిష్కరించకుంటే ఈసారి సీఎం కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త అయిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నర్రా లలిత శనివారం గుంటూరు నగరంపాలెంలోని రిజిస్ట్రారు కార్యాలయంలో ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపింది. సుమారు మూడు గంటలకు పైగా సెల్‌టవర్‌పైనే కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కేజీవీ సరిత, సీఐ వై.శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ శ్రీధర్‌రెడ్డి సెల్‌టవర్‌ ఎక్కి మహిళ సమస్యలు అడిగి తెలుసుకుని హామీ ఇవ్వడంతో లలిత కిందకు దిగారు. అనంతరం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి గ్రామానికి పంపినట్టుసీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

టీడీపీ నేతలతో ప్రాణభయం
సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళన చేపట్టిన నర్రా లలిత మీడియాతో మాట్లాడుతూ, తన భర్త సాంబశివరావు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తులను రానీయకుండా తన మామగారు మోహన్‌రావు, ఆడపడుచు భర్త జాగర్లమూడి శ్రీనివాసరావు అడ్డుపడుతూ ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని, వారికి స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు అండగా ఉన్నారని ఆరోపించారు.

తన భర్త కేసు విషయంలో వాస్తవాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో, ఈనెల 2వ తేదీ రాత్రి తమ ప్రాంతంలోని రౌడీషీటర్‌ మొవ్వా బుల్లయ్య, జాగర్లమూడి శ్రీనివాసరావు, కాపా శ్రీకాంత్, గడ్డం మురళీకృష్ణ తన ఇంటికి వచ్చి చంపుతామని బెదిరింపులకు దిగారని తెలిపారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్లు చెప్పి రౌడీషీటర్లతో పాటు మాజీ ఎంపీపీ పూనాటి రమేష్‌ తనను భయపెడుతున్నారని పేర్కొన్నారు. చేబ్రోలు సీఐ, వట్టిచెరుకూరు ఎస్‌ఐ వారికి వంత పాడుతున్నారన్నారు. వట్టిచెరుకూరు ఎస్‌ఐ అశోక్‌ తనపై వ్యభిచారం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు