భర్త చేతిలో రోజూ చావలేక..

28 Dec, 2017 12:01 IST|Sakshi
లేక్‌ పోలీసుల అదుపులో తల్లీకొడుకులు (నిందితుడు బిక్షపతి)

కొడుకుతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

గండిపేట చెరువులో దూకుతుండగా అడ్డుకున్న జలమండలి సిబ్బంది

పెళ్లయిన ఏడాదికే భర్త నుంచి వేధింపులు

నాలుగేళ్లుగా భరించి విసిగిపోయిన మహిళ

రోజూ భర్త చేతిలో హింస పడే కంటే చావుతో అన్ని సమస్యలను మరిచిపోవచ్చని భావించింది ఆ మహిళ. అనుకున్నదే తడవుగా తన నాలుగేళ్ల కుమారుడుని తీసుకుని గండిపేట చెరువు వద్దకు వచ్చింది. సందర్శకుల మాదిరిగానే అటూ ఇటూ తిరిగి చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది. నిత్యం భర్త శారీరకంగా పెట్టే వేధింపులు భరించడం కంటే చావే శరణ్యమని భావించింది. తాను మరణిస్తే కొడుకు అనాథ అవుతాడనే భయంతో కొడుకుతో సహా చెరువులో దూకబోయింది.    

రంగారెడ్డి , మణికొండ: భర్త తనను తరచూ కొడుతున్నాడనే కారణంతో ఓ మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో పాటు గండిపేట(ఉస్మాన్‌సాగర్‌) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు రాగా జలమండలి సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. నార్సింగి పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బిక్షపతికి అదే మండలం అజీజ్‌నగర్‌ గ్రామానికి చెందిన అనూష(24)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటికే బిక్షపతికి ఓ మహిళతో వివాహం జరగగా ఆమె అతని బాధలు భరించలేక మరొకరితో వెళ్లిపోయింది. దీంతో ఏడేళ్ల క్రితం అనూషను రెండో వివాహం చేసుకున్నాడు.

వివాహమైన ఏడాది నుంచే ఆమెను వేధించడం ప్రారంభించాడు. దాంతో ఆమె అప్పట్లో మొయినాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు వైపుల పెద్ద వారు నచ్చచెప్పి కాపురం చేయించారు. వారికి ఓ కుమారుడు పుట్టడంతో సమస్యలు సద్దుమణిగి నాలుగేళ్లుగా బుద్దిగానే ఉన్నాడు. గత కొంతకాలంగా బిక్షపతి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య అనూషతోపాటు నాలుగేళ్ల కొడుకు వినయ్‌ను రోజూ చితకబాదుతున్నాడు. ప్రస్తుతం అనూష మూడు నెలల గర్భవతి. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఇద్దర్నీ తీవ్రంగా కొట్టడంతో ఈ బాధల నుంచి తప్పించుకోవాలంటే చావే శరణ్యమని భావించి బుధవారం ఉదయం 11గంటల సమయంలో గండిపేట చెరువు కట్టపైకి కుమారుడితో సహా వచ్చింది. అందరి మాదిరిగానే చెరువును చూసేందుకే వచ్చి ఉంటుందని అక్కడి సిబ్బంది భావించారు. అంతలోనే ఆమె కుమారుడితో పాటు చెరువుకట్టపై వేసిన ఫెన్సింగ్‌ ఎక్కి చెరువులోకి దూకే ప్రయత్నం చేస్తుండటాన్ని అక్కడ పనిచేస్తున్న జలమండలి సిబ్బంది గమనించారు. సాయిబాబ, మునీర్‌లు హుటాహుటిన వెళ్లి ఆమెను కాపాడి లేక్‌ పోలీసులకు అప్పగించారు. దాంతో వారు నార్సింగి పోలీస్‌స్టేసషన్‌కు తరలించి కేసు నమోదు చేసి వారి ఆత్మహత్యాయత్నానికి కారణమైన బిక్షపతిని రిమాండ్‌కు తరలించారు.

మహిళల ఆగ్రహం..
మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్న స్థానికంగా జలమండలిలో పనిచేస్తున్న మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీపుపై వాతలు తేలేలా కొట్టడాన్ని చూసి బిక్షపతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను, కుమారుడిని పోషించాల్సింది పోయి భార్యనే డబ్బులు తెచ్చివ్వాలని ఎలా అడుగుతావంటూæ బిక్షపతిని నిలదీశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు లేక్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై నాగేశ్వర్‌రావును కోరారు.

మరిన్ని వార్తలు