కరీంనగర్‌లో కీచక ప్రొఫెసర్‌

30 Jul, 2019 08:41 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఇంజనీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసీఈ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరించే సురేందర్‌ అనే ప్రొఫెసర్‌ ఆ విద్యార్థినిని వేధించడంతోపాటు వాట్సప్‌ చాటింగ్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ ఫొటోలు, సదరు కీచక ప్రొఫెసర్‌ ఫొటోలు, వీడియోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే కళాశాల విద్యార్థిని వేధించిన ఘటన గానీ, ఆత్మహత్యాయత్నం గానీ ఇప్పట్లో కాకుండా కొద్దిరోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే సదరు హెచ్‌ఓడీ సురేందర్‌ను కళాశాల నుంచి పంపించివేసిన యాజమాన్యం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులతో చర్చించి విషయం బయటకు పొక్కకుండా చూసినట్లు సమాచారం. కాగా సంఘటనకు సంబంధించి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కడా పోలీసు కేసు నమోదు కాలేదు. సదరు విద్యార్థిని ఆచూకీ కూడా తెలియకపోవడం గమనార్హం. 

అసలేం జరిగిందంటే... 
కళాశాల యాజమాన్యం, వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు..సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజాంపల్లికి చెందిన విద్యార్థిని అల్గునూరులోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీలో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా పనిచేసే ప్రొఫెసర్‌ సురేందర్‌ ఆ విద్యార్థినిపై కన్నేశాడు. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ, సదరు ప్రొఫెసర్‌ను కాలేజీ నుంచి తొలగించారు.

అయితే ఈ ప్రొఫెసర్‌ వేధింపులు భరించలేక కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సోమవారం సురేందర్‌ అనే ప్రొఫెసర్‌ ఆ విద్యార్థినితో జరిపిన చాటింగ్‌కు సంబంధించిన మొబైల్‌ స్క్రీన్‌షాట్లు, తన రూంకు రావాలని అభ్యర్థిస్తే, ఆ విద్యార్థిని నిరాకరించడం ఈ స్క్రీన్‌షాట్‌ ఫొటోల్లో కనిపిస్తోంది. దీనికి తోడు సురేందర్‌ వీడియోలు, ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. 

పోలీసులకు సమాచారం లేదు
తిమ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇంజనీరింగ్‌ కళాశాల ఉండగా, విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి సంబంధించి  అక్కడ ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. విద్యార్థిని సొంత గ్రామం నిజాంపల్లి పరిధిలోని కోనరావుపేట మండలంలో గానీ, ఆ అమ్మాయి ఇప్పుడు ఉంటుందని ప్రచారం జరుగుతున్న సిరిసిల్లలో గానీ ఫిర్యాదులు లేవు. ఈ విషయంపై కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా వాట్సప్‌లలో వైరల్‌ అయిన సమాచారం తప్ప ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని స్పష్టం చేశారు.

ప్రొఫెసర్‌ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, నిందితునిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా తమ కళాశాలలో అమ్మాయి ఎవరూ ఆత్మహత్యయత్నం చేయలేదని, ప్రొఫెసర్‌ సురేందర్‌ అనే వ్యక్తి ప్రవర్తన సరిగా లేనందున గతంలోనే కాలేజీ నుంచి తొలగించామని సదరు కళాశాల కరెస్పాండెంట్‌ ‘సాక్షి’కి వివరించారు. అడ్మిషన్ల సమయంలో ఇతర కళాశాలల యాజమాన్యాలు తమను అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు తెరతీశారని అన్నారు. అయితే ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    

మరిన్ని వార్తలు