వసతిగృహాల్లో పురుగుల బియ్యం

29 Jun, 2018 11:12 IST|Sakshi
వసతిగృహంలో పురుగులు పట్టిన బియ్యాన్ని పరిశీలిస్తున్న న్యాయమూర్తి మధుబాబు(ఫైల్‌) 

సెలవుల ముందు మిగిలిన బియ్యం వాడకం

న్యాయమూర్తి పరిశీలనలోనే వెలుగులోకి వచ్చిన పురుగులు  

వసతిగృహ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే ఇప్పుడు వండి పెడుతుండడంతో విద్యార్థులు కష్టమైనా...భరిస్తూ వేరే దిక్కు లేక తింటున్నారు.

పార్వతీపురం : వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల ముందు అధిక సంఖ్యలో బియ్యం ఇండెంట్‌ పెట్టడంతో వేసవి సెలవులకు విద్యార్ధులు ఇంటికి వెళ్లిపోవడం రెండు నెలలు పాటు బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడుతున్నాయి.

వేసవి సెలవుల తరువాత పాఠశాలలు ప్రారంభం కావడం వసతిగృహాలు తెరుచుకోవడంతో విద్యార్థులకు ఈ నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి  వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవల్సిన వసతిగృహ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెడుతున్నారు.

దీంతో విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యం నిల్వ ఉండడం వేసవి సెలవుల తరువాత వాటిని తిరిగి వాడడంతో పురుగులు పట్టిన భోజనాన్ని విద్యార్థులు తినాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు కంటికి కనిపించిన వాటిని ఏరుకుని కనిపించని వాటిని ఆహరంతో కలిపి తినేస్తున్నారు.

పురుగులు పట్టిన బియ్యం గుర్తింపు 

రెండు రోజుల కిందట స్థానిక న్యాయమూర్తి ముధుబాబు వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయన పరిశీలనలో బియ్యాన్ని పరిశీలన చేయగా బియ్యం పురుగులు పట్టినట్టు గుర్తించారు. ఎందుకిలా అని వసతిగృహ అధికారిని ప్రశ్నించగా వేసవి సెలవులకు ముందు తెచ్చిన బియ్యం కావడంతో పురుగు పట్టాయని చెప్పడంతో న్యాయమూర్తి పిల్లలకు వీటినే పెడితే ఎలా అని మందలించారు.

నిల్వ బియ్యాన్ని వెనక్కి పంపించి కొత్త బియ్యాన్ని తెప్పించుకోవాలని ఆదేశించారు. ఇలా అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యాన్నే ప్రస్తుతం విద్యార్థులకు వండి పెడుతున్నారు. దీంతో విద్యార్ధులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా వసతిగృహ అధికారులు నిల్వ బియ్యాన్ని తరలించి కొత్త బియ్యాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది.

మరిన్ని వార్తలు