చంపేసి.. కాల్చేశారు

26 Dec, 2017 09:54 IST|Sakshi
మహేష్‌(ఫైల్‌)

యువకుడి దారుణహత్య

మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు

పోలీసుల అదుపులో ఒకరు!

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): కారణం ఏంటో.. ఏమో.. దుండగులు ఓ యువకుడిని దారుణంగా చంపేసి మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులుబెట్టారు. నిందితులు తాము వినియోగించిన కారును వాషింగ్‌కు ఇచ్చారు.. ఈక్రమంలో సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన శంషాబాద్‌ మండల పరిధిలోని మదన్‌పల్లి సమీపంలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మదన్‌పల్లి నుంచి ముచ్చింతల్‌ వెళ్లే దారి పక్కన కాలిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డుకు అతి సమీపంలో మృతదేహాన్ని పెట్రోలు పోసి కాల్చేసిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటనా స్థలంలోని ఓ పెట్రోలు డబ్బా పడి ఉంది. అయితే, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాకపోవడంతో మొదట గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు.  

పోలీసులకు పట్టించిన కారు..  
మదన్‌పల్లి సమీపంలో హత్యకు గురై దుండగులు కాల్చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లోని జుమ్మరాత్‌బజార్‌ నివాసి మహేష్‌గౌడ్‌(21)గా పోలీసులు గుర్తించారు. ఇతడు బేగంబజార్‌లోని ఓ కిరాణా దుకాణంలో పని చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి కడ్తాల్‌ వెళ్లున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహేష్‌గౌడ్‌ను నగరం నుంచి కారులో తీసుకొచ్చిన నిందితులు హత్య చేసి ఇక్కడ తగులబెట్టినట్లు తెలుస్తోంది. మహేష్‌గౌడ్‌ను తన ఇంటి పక్కనే ఉండే స్నేహితుడితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు సమాచారం. మహేష్‌గౌడ్‌ను కారులోనే కత్తితో పొడిచి హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున మృతదేహాన్ని మదన్‌పల్లి దారి పక్కన తగులబెట్టిన దుండగులు కారును తీసుకుని శంషాబాద్‌ వచ్చారు. పట్టణంలోని ఓ సర్వీసు సెంటరుకు వెళ్లి కారును వాషింగ్‌కు ఇచ్చారు. వాహనంలో రక్తం ఉండడంతో సర్వీసు సెంటరు సిబ్బంది నిరాకరించారు.

దీంతో ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి వారిని ఒప్పించారు. వాషింగ్‌ పూర్తయిన తర్వాత ఫోన్‌ చేయాలని సెల్‌నంబర్‌ ఇచ్చి వెళ్లారు. అయితే, కారులోపల ఉన్న రక్తం మరకలపై సర్వీసు సెంటర్‌ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సెంటరు నిర్వాహకులతో నిందితులకు ఫోన్‌ చేయించారు. కారు తీసుకెళ్లేందుకు అక్కడికి వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు మృతుడి వివరాలు రాబట్టారు. నిందితులు వినియోగించిన కారును ఓ వ్యక్తి వద్ద అడిగి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వీరు కారులో ఎక్కడెక్కడ తిరిగారు.. మహేష్‌గౌడ్‌ను ఎందుకు చంపేశారు..? అనే కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమాయ్యరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈమేరకు శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు