-

శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేసిన ఏపీ హైకోర్టు

19 Jul, 2019 15:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత ఏడాది విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. నిందితుడు శ్రీనివాస్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శ్రీనివాస్‌ బెయిల్‌ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్‌పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది.

శ్రీనివాస్‌కు ఈ ఏడాది మే 22న బెయిల్‌ మంజూరు కాగా, 25న జైలు నుంచి విడుదల అయ్యాడు. దీంతో కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ....హైకోర్టులో అభ్యర్థించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అసలు బెయిల్‌ మంజూరుకు కారణాలు కూడా తెలపలేదన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్‌ 6ఏ ప్రకారం బెయిల్‌ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని కోర్టుకు విన్నవించారు. 2018 అక్టోబర్ 25న వైఎస్‌ జగన్‌పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై దాడి జరిగింది. 

మరిన్ని వార్తలు